మాక్స్ వెల్.. ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజయాల్ని అందించాడు. వరల్డ్ కప్లో మాక్స్ వెల్ చేసిన అద్భుత ద్విశతకం ఇప్పట్లో ఎవరూ మర్చిపోరు. అలాంటి మాక్స్ వెల్ క్రికెట్ ఆస్ట్రేలియా తలదించుకొనేంత పని చేశాడు. ఓ పార్టీలో తప్పతాగి పడిపోయాడు. స్పృహ కోల్పోయిన మాక్స్ వెల్ ని ఆసుపత్రికి తరలించాల్సివచ్చింది. అడిలైడ్ లో జరిగిన ఓ సంగీత విభావరిలో పాల్గొన్న మాక్స్ వెల్ అక్కడ ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ తరవాత స్పృహ తప్పి పడిపోయాడు. మాక్సిని లేపడానికి సన్నిహితులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి అంబులెన్స్ సహాయంతో మాక్సిని ఆసుపత్రికి తరలించాల్సివచ్చింది.
ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ అయ్యింది. ఓ పబ్లిక్ ఫంక్షన్లో మాక్స్వెల్ ఇలా ఎందుకు ప్రవర్తించాడంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటనలు జరక్కూడదని, ప్రజలంతా గమనిస్తున్నారని, ఎవరు తీసుకొనే నిర్ణయాలకు, ఎవరు చేసిన తప్పులకు వాళ్లే బాధ్యులని పరోక్షంగా మాక్సిని హెచ్చరించాడు. ఈ ఘటనపై విచారణ జరపాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటుంది. ఆటగాళ్లు క్రమిశిక్షణ తప్పితే.. ఉపేక్షించదు. మాక్స్ వెల్ విషయంలోనూ బోర్డు ఓ కఠిన నిర్ణయం తీసుకొంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మాక్స్ ఆడుతున్నాడు. తన జట్టుని ప్లే ఆఫ్ చేరుకోవడంలో విఫలం అయ్యింది. దానికి తోడు వెస్టిండీస్ తో జరగబోయే సిరీస్ లో మాక్స్ జట్టులో చోటు కోల్పోయాడు. ఆ బాధలో మాక్స్ వెల్ తప్పతాగి ఇలా ప్రవర్తించాడనికి సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి.