తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల నిర్వహణే గగనమైపోయింది. ఏ నాలుగేళ్లకో ఓ మ్యాచ్ జరుగుతుంటుంది. క్రికెట్ లవర్స్ అంతా ఆ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఈ రోజు జరిగిన విశాఖపట్నం వన్డే మ్యాచ్ కూడా ఇలానే ఊరించింది. భారత్, ఆసీస్ మ్యాచ్ చూడాలని వేల సంఖ్యలో అభిమానులు పదిరోజుల క్రితం టికెట్లు బుక్ చేసుకొని , వర్షం కారణం మ్యాచ్ రద్దు అవుతుందేమో అని ఓ పక్క టెన్షన్ పడుతూ, ఎంతో ఆశతో స్టేడియంలోకి అడుగుపెట్టారు.
వరుణుడు కరుణించాడు కానీ మన టీమే దెబ్బేసింది. ఆదివారం.. వన్డే మ్యాచ్.. పైగా డే అండ్ నైట్. ఒక రోజంతా సరదాగా గడుపుదామని స్టేడియంలో కూర్చున్న ఆడియన్స్ కి ఇండియన్ బ్యాటింగ్ లైన్ పెద్ద షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పేకమేడలా కూలిపోయింది. ఒక్క బ్యాట్స్ మెన్ కూడా వికెట్ల ముందు కాసేపు నిలబడలేదు. కేవలం 117 పరుగులకే ఇండియా ఇనింగ్స్ ముగిసిపోయింది.
పోనీలే పిచ్ బౌలింగ్ కి అనుకూలంగా వుంది. మన బౌలర్లు కనీసం ఓ నాలుగు వికెట్లు పడగొడితే చూద్దామని కూర్చున్న ప్రేక్షకులకు.. ఈసారి ఆసీస్ బ్యాట్స్ మెన్స్ షాక్ ఇచ్చారు. ఒక్క వికెట్ పడకుండా బారత బౌలర్లని పిచ్చికొట్టుడు కొట్టారు. 118 పరుగుల టార్గెట్ ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఓపెనర్ల కేవలం 11 ఓవర్లలోనే ఫినిష్ చేసేశారు.
సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగుతూ ఆసీస్ బ్యాటర్లు ఆడుతుంటే..‘’మనోళ్ళకి ఏమైయింది.. వాళ్ళు బాగానే బ్యాటింగ్ చేశారు కదా’’ అని ఉసూరుమంటూ స్టేడియం నుంచి వెనుదిరిగారు ప్రేక్షకులు. వన్డే మ్యాచ్ .. టీట్వంటీ కంటే త్వరగానే ముగిసిపోయింది. దీంతో ఆదివారం పుట కాలక్షేపం కోసం మరో ఆప్షన్ చూసుకోవాల్సి వచ్చింది.
ఇక ఈ విజయంతో ఆసీస్ 1-1తో సిరీస్‌ను సమం చేసింది. చెన్నై వేదికగా జరిగే చి మూడో మ్యాచ్ సిరీస్ విన్నర్ ని డిసైడ్ చేస్తుంది.