గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారని ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు వేకెన్సీ రిజర్వ్‌కు పంపేశారు. ఉన్నతాధికారుల నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కానిస్టేబుళ్లు అయితే మాత్రం వారికి వ్యక్తిగత ఇష్టాలు ఉండకూడదా అన్న అనుమానం ప్రారంభమయింది. పవన్ కల్యాణ్‌ను అభిమానిస్తే.. ఆయనపుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటే పోలీసు శాఖకు వచ్చిన చెడ్డపేరు ఏమిటన్న అనుమానం అందరికీ వస్తోంది. అదే సమయంలో పోలీసులు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కార్యక్రమాల్లో పాల్గొంటే అవార్డులు.. రివార్డులు ఇస్తున్న విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు.
పోలీసులు అంటే అధికార పార్టీకీ మాత్రమే అభిమానం చూపాలని.. సినిమాల పరంగా అభిమానం ఉన్నా కూడా చూపకూడదన్నట్లుగా ఉన్నతాధికారుల తీరు ఉందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. పోలీసుల తీరు సామాన్యులను రోజూ ఆశ్చర్య పరుస్తూంటే ఆ డిపార్టుమెంట్‌లోనూ వారి పక్షపాత చర్యలు సొంత వారిని కూడా వదిలి పెట్టకుండా వేధింపులకు పాల్పడుతున్నారని తాజా పరిణామాలతో తేలుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రధాన పోస్టులన్నీ ఓ వర్గానికే దక్కుతున్నాయి. ఏ జిల్లాలో చూసినా డీఎస్పీ, సీఐ లాంటి పోస్టుల పేర్లను చూస్తే ఎవరెవరికి అందలం దక్కిందో అర్థమైపోతుందని… చాలా మందికి కనీసం పోస్టింగులు లేవని గుర్తు చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల నడుమ దిగువ స్థాయిలో పని చేసే కానిస్టేబళ్లను కూడా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారన్న కారణంగా చర్యలు తీసుకోవడం పోలీసు డిపార్టుమెంట్‌పై ప్రజల్లో మరో రకమైన అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయన్న అభిప్రాయం వినిపించేందుకు కారణం అవుతోంది. సాక్షాత్తూ ఉన్నతాధికారులే రాజకీయ కామెంట్లు చేస్తున్న సమయంలో ఈ కానిస్టేబుళ్లకు మాత్రమే ఎందుకు నిబంధనలు వర్తింప చేశారో పోలీసు శాఖ బహిరంగ ప్రకటన చేస్తే ప్రజలు నిజాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.