సోషల్ మీడియాతో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. చేతిలోని చాకుతో కూరగాయలూ కోయవచ్చు. పీకలూ కోయవచ్చు. ఫేస్ బుక్ కూడా అంతే. ఇటీవల తమిళనాడులో ఓ యువతి మార్ఫింగ్ ఫొటోల పోస్టింగ్ కేసులో ఫేస్ బుక్ పై కేసు నమోదైంది. ఇప్పుడు అమెరికాలో అదే ఫేస్ బుక్ తో ఓ సామాన్యుడికి ఖరీదైన కారు బహుమతిగా వచ్చింది.
న్యూ హ్యాంప్ షైర్ లో నివసించే ఆ వ్యక్తి పేరు కైల్ బిగ్లర్. అతడి కుటుంబ పోషణ కోసం చాలా కష్టపడుతున్నాడు. అవసరాలు, ఖర్చులు ఎక్కువ. దీంతో ఒక్క ఉద్యోగం చాలక రోజూ రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు. కొడుకు పోషణ, బిల్లుల చెల్లింపులకే జీతం సరిపోవడంతో సొంత వాహనం కొనుక్కోలేకపోయాడు. రోజూ 26 కిలోమీటర్లు నడిచివెళ్తాడు. ఇలా అతడు జోనా గ్రిఫిత్ అనే యువతికి తరచూ తారసపడే వాడు.
ఎప్పుడు చూసినా నడిచే వెళ్తుంటాడు ఏమిటబ్బా అని ఆరా తీసింది. అతడి వివరాలను తెలుసుకుంది. అతడి అవసరాలు, పరిస్థితిని వివరిస్తూ ఓ కథనాన్ని రాసింది. మనసుకు హత్తుకునేలా ఉన్న ఆ కథనాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ కథనం చాలా మందిని కదలించింది. అంతే, 20 వేల మందికి పైగా దాన్ని షేర్ చేశారు. ఎంతో మంది లైక్ చేశారు.
ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టిన ఆ కథనం ఆటో సర్వ్ అనే కంపెనీ వాళ్ల దృష్టిని ఆకర్షించింది. అతడి పరిస్థితిని తెలుసుకున్న కంపెనీవాళ్లు తమ వంతు సహాయం చేద్దామని నిర్ణయించారు. హోండా ఎకార్డ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఏ యువతి కథనం వల్ల బిగ్లర్ కు ఈ కారు నజరానా దక్కిందో ఆ యువతి సదరు కారు ముందు నిలబడి ఎంచక్కా ఫొటోలకు పోజిచ్చింది.