మాజీ ఎంపి వైకాపా నేత అనంత వెంకట్రామిరెడ్డి కర్నూలు జలదీక్ష వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిపై నిశితంగా విమర్శించారు. “తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టిసీమ ప్రాజెక్టుని సమర్ధించినప్పుడే మాకు అనుమానం కలిగింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కలుగకపోవడమే విచిత్రం. అయన ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఒకలాగ, ప్రజలతో మరొకలాగ మాట్లాడుతుంటారు. ఎగువనున్న కర్నాటక, మహారాష్ట్రాలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకొంటుంటే, వారిని చూసి మన రాష్ట్రానికి ఎగువనున్న తెలంగాణాలో కూడా తమ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు నిర్మించుకొంటున్నారు. తెలంగాణా ప్రాజెక్టుల వలన రాష్ట్రానికి నీటి కరువు వస్తుందని తెలిసినా ఆయన తెలంగాణా ప్రభుత్వాన్ని అడ్డుకోరు. కేంద్రంతో ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడరు. చంద్రబాబు నాయుడు ఎంతసేపు తన స్వార్ధ ప్రయోజనాలే చూసుకొంటున్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదు,” అని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ళ కోసం ఎన్ని గొడవలు జరిగాయో అందరూ చూశారు. కానీ ఈ రెండేళ్ళలో జగన్, వెంకట్రామరెడ్డితో సహా వైకాపా నేతలెవ్వరూ కూడా ఈవిధంగా ఆంధ్రప్రదేశ్ తరపున మాట్లాడిన దాఖలాలు లేవు. నీళ్ళ పంపకాలు ఒక్కటే కాదు ఇంకా చాలా సమస్యలపై వారు మౌన ప్రేక్షక పాత్ర పోషించారు. వారు అప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. తెలంగాణా ప్రాజెక్టుల వలన ఆంధ్రాకి చాలా నష్టం వస్తుందనే ఆన్దోలనతోనే తాము ఉద్యమిస్తున్నామని వైకాపా చెపుతున మాటలు నమ్మశక్యంగా లేదు. అందుకు వేరే బలమయిన కారణం మరేదయినా ఉండి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ దీక్ష వెనుక ఉద్దేశ్యాలు ఏవయినప్పటికీ ఆయన లేవనెత్తిన ఈ సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం దృష్టి సారించడం మంచిది.