మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన హత్యకు సుపారీ ఇచ్చారని..కర్నూలు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని రోజుల క్రితం.. కడప జిల్లాలో ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యాభై లక్షల రూపాయల సుపారీ తీసుకున్నారని.. పోలీసులు గుర్తించారు. అయితే.. సుపారీ ఎవరు ఇచ్చారు…అన్నదాన్ని మాత్రం ఇంకా విచారణలో తెలుసుకోలేకపోయారు. అయితే హఠాత్తుగా ఏవీ సుబ్బారెడ్డి మీడియాను పిలిచి.. భూమా అఖిలప్రియపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమెతో పాటు.. ఆమె భర్త.. భార్గవ తనను చంపేందుకు కుట్ర పన్నారని .. రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్ సంజోరెడ్డితో… రూ.50లక్షలకు సుఫారీ కుదుర్చుకున్నారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. మహిళ ముసుగులో అఖిలప్రియ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని.. మండిపడ్డారు.
రాజకీయ కుట్రతోనే నా హత్యకు అఖిలప్రియ ప్రణాళిక వేసిందని.. అఖిప్రియను, ఆమె భర్త భార్గవను వెంటనే అరెస్ట్ చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఏ.వీ. సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా వ్యవహరించారు. ఆయన ఎక్కడ ఉంటే…ఏవీ సుబ్బారెడ్డి అక్కడ ఉండేవారు. అఖిలప్రియ కూడా ఆయనను మామా అని పిలిచేవారు. అయితే.. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకు.. విబేధాలు వచ్చాయి. ఏ వీ సుబ్బారెడ్డి రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నించడం.. నంద్యాల ఉపఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత ఆళ్లగడ్డలోనూ…రాజకీయ పర్యటనలు చేశారు. దీంతో..సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. చంద్రబాబు ఏవీ సుబ్బారెడ్డికి ఓ నామినేటెడ్ పదవి ఇచ్చి బుజ్జగించారు.
ఎన్నికలు అయిపోయి.. ఓడిపోయిన తర్వాత కూడా.. అఖిలప్రియతో సంబంధాలు మెరుగుపడలేదు. ఇప్పుడు.. అవి హత్యా ఆరోపణలు వరకూ వెళ్లాయి. అఖిలప్రియ ఆళ్లగడ్డ … ఆమె సోదరుడు నంద్యాల అసెంబ్లీ సీట్లకు ఇన్చార్జ్ గా ఉన్నారు. ఏ.వీ.సుబ్బారెడ్డి హత్యకు ఎవరు కుట్ర పన్నారో.. ఎవరు సుపారీ ఇచ్చారో పోలీసులు చెప్పక ముందే… సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియను టార్గెట్ చేయడం.. రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.