చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో పవర్ కట్‌కి కారణం కాకి. నిజంగా కాకే కరెంట్ తీసింది. నమ్మి తీరాల్సిందేనని మంత్రి అవంతి శ్రీనివాస్ నొక్కి చెబుతున్నారు. విశాఖలో చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశమైన సమయంలో… రెండు సార్లు కరెంట్ పోయింది. అప్పుడే మీడియా కూడా లైవ్ కవరేజీ ఇస్తూండటంతో కరెంటు పోయినప్పుడల్లా చీకటిగా మారిపోయింది. ఇలా రెండు సార్లు కరెంట్ వచ్చి పోవడంతో… ఏపీలో ప్రస్తుత పరిస్థితి కూడా అంధకారంగా ఉందని.. చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్.. విద్యుత్ అధికారుల వద్ద నుంచి సమాచారన్ని సేకరించారు. వారు కూడా.. తమ క్రియేటివిటీని ఏ మాత్రం తగ్గించుకోకుండా… చంద్రబాబు సమావేశం జరుగుతున్న భవనం వద్ద.. కాకులు ఎక్కువగా తిరుగుతున్నాయని..ఓ కాకి కరెంట్ తీగలకు తగలడం వల్ల.. కరెంట్ పోయిందని… వివరాలు పంపించారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా.. ముందూ వెనుకా చూసుకోకుండా.. మీడియాకు.. ఈ కాకి కబురు చెప్పేశారు. దీంతో.. పెదాలు బిగపట్టి నవ్వుకోవడం.. మీడియా ప్రతినిధుల వంతు అయింది. కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు అమలవుతున్నాయి. సరిపడనంత విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. ఎక్సేంజీల్లో కొందామన్నా.. భారీ ధర చెల్లించాల్సి వస్తోంది. మరో వైపు కరెంట్ డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణంగా కోతలు అమలు చేస్తున్నారు. ఓ షెడ్యూల్ ప్రకారం.. కరెంట్ కోతలు అమలు చేయడం కూడా సాధ్యం కాదని.. విద్యుత్ అధికారులు ముందుగానే చెప్పారు. దాంతో ఏపీ ప్రజలు కూడా.. మానసికంగా ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో.. అన్నట్లుగా.. సిద్ధమైపోయారు.
అయితే విద్యుత్ కొరత లేదని చెప్పడానికి మంత్రులు.. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పిన కారణం మాత్రం ఇంత వరకూ ఎవరూ చెప్పలేదు. మొత్తానికి కరెంట్ కోతలకు కాకే కారణం అని చెప్పిన మొదటి మినిస్టర్ అవంతి మాత్రమే అవుతారేమో..?