మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. జగన్ రెడ్డికి పార్టీ నడపడం రావడం లేదని ఆయన భావన. కొంత కాలంగా ఆయన రాజకీయాల్లో కనిపించడం లేదు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరుతారో స్పష్టత లేదు. టీడీపీ చేర్చుకునే అవకాశం లేదు. ఆయన పూర్వం పీఆర్పీ నుంచి వచ్చారు కాబట్టి జనసేనలో ప్రయత్నించవచ్చు. చివరికి బీజేపీ అయినా ఓకే అని ఆయన రెడీగా ఉన్నారు.
అవంతి శ్రీనివాస్ పీఆర్పీ నుంచి పోటీ చేసిన గెలిచిన వారిలో ఒకరు. భీమిలీ నుంచి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు.ఆయనకు అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో గెలిచిఎంపీ అయ్యారు. అయితే ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టీడీపీని, చంద్రబాబును నానా తిట్లు తిట్టారు. వైసీపీ గెలవడంతో మంత్రి అయ్యారు. కానీ అక్కడే ఆయన పతనం ప్రారంభమయింది. మంత్రిగా ఆయన చేసిందేమీ లేకపోగా తర్వాత పదవి తీసేసి గుడివాడ అమర్ కు ఇచ్చారు. తర్వాత టిక్కెట్ కూడా ఇస్తారా లేదా అన్న సందేహం ఏర్పడినా చివరికి ఎలాగోలా టిక్కెట్ దక్కించుకున్నారు. కానీ గంటా చేతిలో అత్యంత ఘోరంగా ఓడిపోయారు.
ఓడిపోయిన తర్వాత అసలు జగన్ పట్టించుకోవడంలేదు. పార్టీ కార్యక్రమాలకూ పిలుపురావడంలేదు. దాంతో ఆ పార్టీలో ఉండి ప్రయోజనం లేదని డిసైడయ్యారు. ఇప్పుడు కూటమి పార్టీల్లో చేరాలంటే చాలా సమీకరణాలు ఉంటాయి. వాటన్నింటినీ ఆయన ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికైతే రాజీనామా చేసి కొన్నాళ్లు ఏ పార్టీలో లేకుండా సైలెంటుగా ఉంటారని అంటున్నారు.