ఆంధ్రప్రదేశ్ కాపుల రిజర్వేషన్ల అంశమై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి దీనిపై తానేం చెయ్యలేనని ఈమధ్య అనడమూ, ఆ తరువాత విమర్శలు వెల్లువెత్తేసరికి యూ టర్న్ తీసుకుని కట్టుబడి ఉన్నామని మాట మార్చడమూ చూశాం. అయితే, ఇదే అంశం ఇంకోపక్క టీడీపీ ఎంపీలు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా కాపుల రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలంటూ లోక్ సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును పెట్టారు టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్. ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ డిమాండ్ చేశారు. కాపుల రిజర్వేషన్లకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పదేపదే ఆ పార్టీ చెబుతూనే ఉంది. అసెంబ్లీలో చాన్నాళ్ల కిందటే తీర్మానించారు. కానీ, కేంద్రమే ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇంతకీ, ఈ ప్రైవేటు మెంబర్ బిల్లు సభలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయా అనేదే అనుమానం! ఈ బిల్లును ఎప్పుడు చర్చకు అనుమతించాలనేది సోమ, లేదా మంగళవారం జరగబోయే బి.ఎ.సి.లో చర్చిస్తారని సమాచారం. బీయేసీ ఓకే చేసి, ఆ తరువాత సభాపతి అనుమతిస్తే చర్చ జరుగుతుంది. అయితే, తాజా సమావేశాలు వచ్చే వారాంతం వరకూ మాత్రమే జరుగుతాయి. అంటే, ఈలోగా చర్చకు రావడం అనుమానమే అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ బిల్లుపై చర్చకు అనుమతించిన మాత్రాన రిజర్వేషన్లకు ఆమోదం పొందే అవకాశాలు ఉంటుందని చెప్పలేం. అనుమతిస్తే, ఈ అంశంపై చర్చ జరుగుతుంది. సభలో మాట్లాడేందుకు టీడీపీకి చెందిన ఇద్దరో ముగ్గురో ఎంపీలకు అనుమతి లభిస్తుంది. ఇలా అవకాశం రావడం వల్ల… ఏపీలో కాపులకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించాలనే అంశాన్ని సభకు వివరించొచ్చు.
అయితే, దీనిపై కూడా ఓసారి చర్చకు అవకాశం ఇచ్చేస్తే పనైపోతుందని భాజపా అనుకునే అవకాశాలు తక్కువ. ప్రస్తుత పరిస్థితిలో పార్లమెంటులో చర్చకు అనుమతిస్తే… అది పరోక్షంగా ఆంధ్రాలో టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, కాపుల విషయంలో టీడీపీ మోసం చేసిందీ, రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతోందంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పైగా, జగన్ వ్యాఖ్యలు కూడా ప్రతిపక్షానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో చర్చకు అనుమతించే అవకాశాలు కాస్త తక్కువగానే ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే, చర్చకు ఇప్పుడే వస్తుందా, వచ్చే సమావేశాల్లో చర్చిస్తారా అనే అంశం ఎలా ఉన్నా… రిజర్వేషన్లపై తాము చేయాల్సిన ప్రయత్నాలు ఢిల్లీ స్థాయిలోనూ చేస్తున్నామని టీడీపీ మరోసారి చెప్పుకునేందుకు ఈ ప్రైవేటు మెంబర్ బిల్లు అవకాశం కల్పిస్తుంది.