దేశంలో మోడీ ప్రభుత్వం తెచ్చిన రవాణా శాఖ చట్టం ప్రకారం.. ఫైన్లను తప్పించుకోవడానికి ఓ మేలైన చిట్కాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి.. అవంతి శ్రీనివాస్ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు చెప్పారు. ఆ చిట్కా ఏమిటో కాదు… వారి వాహనాలపై జగన్ బొమ్మ పెట్టుకోవడమేనట. క్యాబ్‌లు, ఆటోలపై సీఎం జగన్ ఫొటో పెట్టుకోండి … ఆర్టీఏ అధికారులెవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని మంత్రి అవంతి శ్రీనివాస్ నేరుగా ప్రకటించారు. విమానాల్లో తిరిగేవారు కాదు.. ఆటో డ్రైవర్లే తమకు ముఖ్యమని కూడా ప్రకటించుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని చాలా బీజేపీ రాష్ట్రాలు.. అమలు చేయడానికి సంకోచిస్తూంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం అలాంటివేమీ పెట్టుకోలేదు. జరిమానాలు అమలు చేయడానికి రెడీ అయిపోయారు. దీన్ని జగన్ ఫోటోతో మైనస్ చేస్తామని… చెబుతున్నారు.
మంత్రి స్థానంలో ఉండి.. చట్టాన్ని పాటించాలని చెప్పేవాళ్లను చూశాం కానీ.. ముఖ్యమంత్రి ఫోటోను పెట్టుకుని యధేచ్చగా.. చట్టాలను ఉల్లంఘించమని చెప్పే మంత్రి బహుశా.. ప్రపంచంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఒక్కరే అయి ఉంటారు. సొంత పార్టీ వాళ్లయినా.. చట్టాని ఉల్లంఘించిన వారిని శిక్షించిన ప్రభుత్వాలను ఇప్పటి వరకూ చూశాం. కానీ.. అవంతి ఈవిషయంలో మరింత ముందుకెళ్లిపోయారు. తాము అధికారంలో ఉన్నాం.. కాబట్టి.. తమ పేరు చెప్పుకుని ఏమైనా చేసేయమన ఆయన ఆటో డ్రైవర్లకు అభయం ఇస్తున్నారు. జగన్ ఫోటో పెట్టుకుంటే.. ఆర్టీఏ అధికారులు ఇబ్బంది పెట్టరని.. చెబితే.. ఇక అందరూ.. జగన్ ఫోటో పెట్టుకుని చట్టాలను ఉల్లంఘిస్తారు.. అప్పుడు తమ రాష్ట్రంలో అందరూ జగన్ ఫోటో పెట్టుకున్నారని ఆనందిస్తారా…? లేక.. చట్టాలకు విలువ లేకుండా పోయిందని.. చట్ట ప్రకారం.. పాలన చేయాల్సిన ముఖ్యమంత్రే.. చట్టాలను ఉల్లంఘించమని పర్మిషన్ ఇచ్చినందుకు సంతోషపడతారా..?
మంత్రిగా అవంతి శ్రీనివాస్ వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. అధికారంలో ఉన్నాం కాబట్టి.. చట్ట వ్యతిరేకంగా అయినా సరే తామేం చేసినా కరెక్ట్ అన్న పద్దతిలో ఆయన మాటలు, వ్యవహారశైలి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో ఇతర పార్టీ నేతల్ని కూడా.. పార్టీలో చేరితేనే ..భవిష్యత్ లేకపోతే కేసులేనని బెదిరిస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్ని బహిరంగంగా ఆటో, క్యాబ్ డ్రైవర్ల చెక్కుల పంణీలో బయట పెట్టారు. మంత్రుల ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే.. ప్రజలకు వైసీపీ నేతల దాష్టీకం మరో రేంజ్‌కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.