తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. తన జోలికి వస్తే ఆయన విశాఖపట్నంలోనే లేకుండా చేస్తానని హెచ్చరించారు! గంటా చేస్తున్నది రాజకీయంగా కాదనీ, రాజకీయ వ్యవభిచారమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీలో కూర్చుని వేరే పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారనీ, ఆయన్ని ఎవరూ పిలిచే అవకాశమే లేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి రోషం పౌరుషం ఉంటే గంటా మీద చర్యలు తీసుకోవాలన్నారు. వైకాపాలో నిజాయితీపరులకు మాత్రమే అవకాశం ఉంటుందనీ, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన గంటా లాంటివారికి చోటు ఉండదన్నారు మంత్రి అవంతి.
మంత్రి అవంతి ఇంత ఘాటుగా ఎందుకు స్పందిస్తున్నారంటే… అంతకుముందు గంటా కూడా అదే స్థాయిలో అవంతిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని మంత్రి తాను ఫీలవడం లేదన్నారు. ఆయనేదో రెచ్చగొడిత నేను మాట్లాడననీ, వైకాపాలో పోవాలనుకుంటే ఆయనలాంటివారెవ్వరూ తనకు అడ్డం కాదన్నారు. పార్టీ మారాలనుకుంటే ఆయనలా చాటుమాటుగా వెళ్లననీ, అందరికీ చెప్పి చర్చించాకనే వెళ్తానన్నారు. ఈ మాటలకే అవంతి స్పందించారు. ఎవరు మంత్రో ఎవరు కాదో అనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే తెలుస్తుందని గంటాను ఉద్దేశించి విమర్శించారు. నువ్వేమన్నా రాజుల కుటుంబం నుంచి వచ్చావా, నెల్లూరు మెస్సుల్లో టోకెన్లు అమ్ముకున్న చరిత్ర మరచిపోయావా అన్నారు అవంతి. గంటా మాదిరిగా తాను ఎవ్వర్నీ మోసం చేసి వ్యాపారాలు చేయలేదన్నారు. తన జోలికి వస్తే గంటా చరిత్ర మొత్తానికి బయటకి తీస్తాననీ, తన పేరెత్తితే ఆయన విశాఖపట్నంలో ఉండలేడని హెచ్చరించారు. ఆయన రాజకీయాలను వ్యాపారంగా చూస్తారనీ, అందుకే ఎప్పుడూ ఒకే నియోజక వర్గం నుంచి పోటీ చేయరనీ, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారని అన్నారు.
నిజానికి, అవంతి పార్టీ మారిన దగ్గర్నుంచీ ఈ ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం మొదలైంది. అది ఇప్పుడు వ్యక్తిగత హెచ్చరికలు వరకూ వచ్చింది. ఒకటైతే వాస్తవం… ప్రస్తుతం టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన గంటా… ఎప్పటికప్పుడు, తాను వైకాపాలో చేరాలనుకుంటే ఎవ్వరూ ఆపలేరనీ, పార్టీ మారితే అందరికీ చెప్పే మారతాననీ.. ఇలా కొన్ని వ్యాఖ్యలు చూస్తూనే ఉంటారు. ఈ వ్యాఖ్యలను సొంత పార్టీ టీడీపీ ఎలా చూస్తోందో? ఇలాంటివి కట్టిపెట్టండీ అని అధినాయకత్వం ఆయనకి చెప్పే పరిస్థితి ఉందా, వినే పరిస్థితిలో ఆయన లేరా..? ఆ పాయింట్ ని పట్టుకునే ఇప్పుడు అవంతి తీవ్రంగా విమర్శించే అవకాశం కల్పించినట్టుగా ఉంటోంది.