అష్టాచమ్మా తో లైమ్ లైట్ లోకి వచ్చారు నాని, అవసరాల శ్రీనివాస్. నాని హీరోగా మారితే అవసరాల నటనతో పాటు దర్శకత్వంపై ద్రుష్టి పెట్టారు. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద లాంటి డీసెంట్ సినిమాలు తీశారు. ఇప్పుడు నాగశౌర్యతో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా విడుదలకు రెడీ అవుతుంది.
ఇదీలావుంటే నాని హీరోగా అవసరాల దర్శకత్వంలో సినిమా గురించి గతంలో వార్తలు వినిపించాయి. ఈ కాంబినేషన్ పై తాజాగా అవసరాల శ్రీనివాస్ తన మనసులో మాట చెప్పారు. ”నానితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో వుంది. నటుడిగా నాని అంటే నాకు ఎంతో ఇష్టం. తనతో సినిమా అంటే అంచనాలు వుంటాయి. అలాంటి మంచి కథ కుదరాలి. నానితో తప్పకుండా సినిమా వుంటుంది’’ అని చెప్పారు అవసరాల.
ఇదే సందర్భంలో తాను నటిస్తున్న ‘కన్యాశుల్కం’ గురించి చెప్పారు. గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అవసరాల కీలక పాత్ర పోషించారు. ఆయనతో పాటు ఇషారెబ్బా, వర్ష బొల్లమ్మ ఇందులో ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.