Avatar2 The Way of Water movie telugu review
హ్యూమన్ ఎమోషన్స్ కంటే గొప్ప పాయింట్ ఏముంటుంది? సైన్స్ ఫిక్షన్ చెప్పండి, లవ్ స్టోరీ అనే పేరు పెట్టండి, జోనర్ ఏదైనా కానివ్వండి. అందులో మానవీయ కోణం సృశించాల్సిందే. హాలీవుడ్ దర్శకులు ఎన్ని విజువల్ వండర్స్ తీసినా… ఈ ఎమోషనల్ టచ్, హ్యూమన్ యాంగిల్ వదల్లేదు. అవతార్ కూడా అదే కోవకు చెందిన సినిమా. అవతార్ ని చూసివాళ్లంతా.. ఆ విజువల్స్ గురించి మాట్లాడుకొంటూనే ఉంటారు. అయితే… మనవైన మనిషి మూలాల్ని `అవతార్` దాటి వెళ్లలేదు. కళ్లు మిరిమిట్టు గొలిపే విజువల్స్ తో పాటు.. మనసు మెలేసే దృశ్యాలూ అవతార్‌లో కనిపిస్తాయి. అందుకే `అవతార్` హద్దుల్ని చెరిపేసి విశ్వ సినిమాగా మారిపోయింది. `అవతార్ 2` కోసం ఏళ్ల తరబడి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే.. ఎక్కడో హాలీవుడ్ లో, పేరు తిరగని ఓ దర్శకుడు తీస్తున్న సినిమా గురించి ఇక్కడ ఆంధ్రాలో కూడా మాట్లాడుకొంటున్నారంటే.. దానికి కారణం.. ప్రేక్షకులపై ఉన్న అవతార్ ఇంపాక్టే. ఇప్పుడు `అవతార్ 2` మన ముందుకు వచ్చింది. ది వే ఆఫ్ వాటర్ అంటూ జేమ్స్ కెమరూన్ మరో ప్రపంచాన్ని కళ్ల ముందుకు ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. మరి ఇన్ని భారీ అంచనాల మధ్య విడుదలైన `అవతార్ 2` స్టామినా ఏమిటి? `అవతార్` స్థాయిలో ఉందా? దాన్ని మించిపోయిందా..?
`అవతార్` ఆగిన చోట `అవతార్ 2, ది వే ఆఫ్ వాటర్` మొదలవుతుంది. `పండోరా` అనే అందమైన గ్రహానికి చెందిన కథ ఇది. భూ ప్రపంచంలోని వనరులు అంతరించిపోతున్న తరుణంలో.. మనుషుల దృష్టి పండోరాపై పడుతుంది. దాన్ని ఆక్రమించుకొని, అక్కడి తెగపై ఆధిపత్యం చెలాయించడానికి ఓ బృందం ప్రయత్నిస్తుంటుంది. వాళ్ల దాడిని `పండోరా` ఎలా తిప్పికొట్టిందన్నదే `అవతార్` కథ. పార్ట్ 2 కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీ ఉండదు. కాకపోతే… ఈసారి మెట్కయినా అనే అందమైన దీవిని సృష్టించాడు జేమ్స్ కెమరూన్. పార్ట్ 1లో అందమైన అడవిలోని అద్భుతాలు చూపిస్తే… పార్ట్ 2లో ప్రేక్షకుల్ని సముద్ర గర్భంలోకి లాక్కెళ్లాడు.
సముద్రం.. అందులోని ప్రాణులు, మొక్కలు, రంగులు… ఇలా ఓ కొత్త లోకాన్ని సృష్టించాడు జేమ్స్. సినిమా మొదలైన 45 నిమిషాల తరవాతే.. మెట్కయినా దీవిని ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చాడు జేమ్స్ కెమెరూన్. అక్కడి నుంచి… జేమ్స్ సృజనాత్మకత మొదలైపోతుంది. ప్రారంభ సన్నివేశాలు `అవతార్`కి పూర్తి కొనసాగింపుగా ఉంటాయి. అవే లొకేషన్లు కళ్ల ముందు కదలాడతాయి. ఇక మెట్కయినా వెళ్లాక మరోలోకం ఆవిష్కృతమవుతుంది. ఆ దృశ్యాలన్నీ ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడు జేమ్స్. సముద్ర గర్భం ఇంత అద్భుతంగా ఉంటుందా? అనిపిస్తుంది. నిజంగా అలాంటి లోకం ఉంటే బాగుంటుంది కదా అని మనసు తహతహలాడుతుంది. ఒక్కసారి ఆ సముద్రంలో ఈత కొట్టి రావాలనిపిస్తుంది. ఆ నీటి స్పర్శ… మన మేనుకు తాకుతుంది.
అడవి నుంచి.. సముద్రంలోకి రావడం.. జేమ్స్ చేసిన తెలివైన పని. ఎప్పుడైతే కథా నేపథ్యాన్ని మార్చుకొన్నాడో.. అప్పుడే తన సృజనాత్మకతకు అడ్డు లేకుండా పోయింది. అవతార్ 2కి ఎక్కడా ఎలాంటి రిఫరెన్సులూ లేవు. కాబట్టి.. రాబోయే సినిమాలకు తనే ఓ రిఫరెన్స్‌గా ఉండాలన్న కసితో, తపనతో.. ఆయా సన్నివేశాల్ని జేమ్స్ కెమెరూన్ డిజైన్ చేసుకొన్నాడనిపిస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తన మాయాజాలం పూర్తిగా కనిపిపస్తుంది. నీటిలో సాగే యుద్ధం, సముద్ర ప్రాణుల్ని సైతం ఈ యుద్ధంలో సైనికుల్ని చేయడం.. నిజంగా గొప్ప థాట్. వార్ సీక్వెన్స్ దాదాపు 30 నిమిషాల పాటు సాగుతుంది. ఆయా సన్నివేశాలన్నీ ఒళ్ల గగుర్పాటుకి గురి చేస్తాయి. ఓ కమర్షియల్ సినిమా క్లైమాక్స్ లో అతిథి పాత్రలో ఓ స్టార్ హీరో వచ్చి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో..? ఇందులో ఓ సముద్ర జీవి ఎంట్రీ అలా అనిపిస్తుంది. ఆ సీన్ నిచూస్తే.. జేమ్స్ కూడా పక్కా కమర్షియల్ ఫార్మెట్ లోనే ఆలోచిస్తున్నాడనిపిస్తుంది. మొత్తానికి ఓ భారీ క్లైమాక్స్ తో `అవతార్ 2`పై పెట్టుకొన్న అంచనాల్ని నిలబెట్టుకొన్నాడు జేమ్స్.
స్థూలంగా చెప్పాలంటే అవతార్ గొప్ప కథేం కాదు. కాకపోతే… ఎమోషన్స్ ని పట్టుకొన్నాడు. ఓ తండ్రికి పిల్లలపై ఉండే ప్రేమ, బాధ్యత… అనేది యూనివర్సల్ అప్పీల్ ఉన్న పాయింట్. దాన్ని ఓ సైన్స్ ఫిక్షన్ లో మిక్స్ చేయడం… జేమ్స్ తెలివితేటలకు నిదర్శనం. ఓ తెగకు రాజు (జేక్) తన పిల్లల కోసం.. తన రాజ్యాన్ని వదిలి, మరో రాజ్యంలో అడుగుపెట్టడం కంటే బలమైన ఎమోషనల్ పాయింట్ ఏముంటుంది? ఎవరైనా సరే.. ఎంత బలవంతుడైనా సరే.. తాను పుట్టిన గడ్డకు ఆక్రమిస్తానంటే గడ్డి పరక కూడా తిరుగుబాటు చేస్తుంది. అవతార్ లో కనిపించింది అదే. ఈ పాయింట్ ఎక్కడైనా అప్లయ్ చేసుకోవొచ్చు. అయితే దాన్నో సైన్స్ ఫిక్షన్ లోకి ఇమడ్చడం జేమ్స్ కెమరూన్ కే సాధ్యం అనిపిస్తుంది.
అవతార్ లాంటి సినిమాల్ని ఎవరూ.. కథ కోసమో, బలమైన ఎమోషన్ కోసమే చూడరు. కేవలం విజువల్స్ కోసం చూస్తారు. అలాగైతే.. రూపాయికి రూపాయి గిట్టుబాటు అయిపోయే సినిమా ఇది. ఇదివరకెప్పూడూ చూడని విజువల్స్ తో.. ఆశ్చర్యానికి గురి చేస్తాడు జేమ్స్ కెమరూన్. ఈ సీక్వెల్ కోసం తాను పన్నెండేళ్లు ఎందుకు కష్టపడ్డాడో.. ఇందులోని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. నిడివి పరంగా చూస్తే.. 3 గంటల 10 నిమిషాల సినిమా ఇది. మనకు ఇంత సుదీర్ఘమైన సినిమాలు చూడడం బోరే. విజువల్ గా ఎంత బాగున్నా – సీట్లలో ఇబ్బందిగా కదలాల్సివస్తుంది. ఆ ఇబ్బంది అవతార్ 2లో ఎదురవుతుంది. కథ ఫ్లాట్ గా ఉండడం, షాకింగ్ ట్విస్టులు కానీ, స్క్రీన్ ప్లే మ్యాజిక్కులు కానీ లేకపోవడం కాస్త లోటు. కాకపోతే.. ఇలాంటి విజువల్స్ మళ్లీ మళ్లీ చూడలేం కాబట్టి… తప్పకుండా థియేటర్లోనే ఆస్వాదించాల్సిన సినిమా ఇది. త్రీడీలో చూస్తే మరీ మంచిది.