అవినాష్ రెడ్డి వ్యవహారం నిరంతర సీరియల్ గా సాగుతోంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సూచించింది. గురువారం అవినాష్ రెడ్డి ముందస్తుబెయిల్ పై వేకేషన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుంది. అయితే అక్కడా అవినాష్ రెడ్డికి మరో చాన్స్ ఉంది. ముందస్తు బెయిల్ వస్తే సరే లేకపోతే.. ఆయన మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఇదంతా నిరంతర ప్రక్రియలా సాగుతోంది.
ముందస్తు బెయిల్ పై ఇప్పటికి ఎన్ని సార్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారో చెప్పడం కష్టం. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున విచారణను జూన్ 5కు వాయిదా వేస్తున్నట్టు ఏప్రిల్ 28న తెలంగాణ హైకోర్టు తెలిపింది. అయితే సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని చెప్పింది. అప్పుడే వేకేషన్ బెంచ్ ముందు విచారణకు సీజే నుంచి సానుకూలత రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పిటిషనర్‌కు ఉందని.. సుప్రీంకోర్టు తెలిపింది.
తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశాలివ్వాలన్న అవినాష్ రెడ్డి లాయర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసి పుచ్చడంతో అరెస్టుకు ఎలాంటి ఆటంకాలు లేనట్లే. నిజానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సీబీఐకి గతంలోనూ ఆటంకాలు లేవు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ స్పష్టం చేసింది. అయితే అరెస్టు నుంచి రక్షణ లభించకపోయినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా హైకోర్టులో విచారణ జరిగే వరకూ అరెస్ట్ చేయకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
ఓ ఘోరమైన హత్య కేసులో నిందితుడికి . .. చట్ట పరంగా ఇన్ని సౌలభ్యాలు లభిస్తూండటం… ప్రజల్ని సైతం విస్మయ పరుస్తోంది. సామాన్యుడి విషయంలో ఇలా వ్యవస్థలు స్పందిస్తాయా అని నోళ్లు నొక్కుకుంటున్నారు.