వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు హింసిస్తున్నారని. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. అసలు వర్రా రవీంద్రారెడ్డి ఎక్కడ ఉన్నారో ఆయనకు ఎలా తెలుస్తోందనేది ఇప్పుడు కీలక విషయంగా మారింది. నెంబర్ వన్ సోషల్ సైకోగా పేరు తెచ్చుకున్న వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేసిన సమయంలో ఆయనను తప్పించడంలో వైఎస్ అవినాష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. నోటీసులు ఇచ్చి పంపించేలా ఆయన పోలీసులపై ఒత్తిడి చేశారని చెబుతున్నారు.
వర్రా పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి ఆయనను సేఫ్ జోన్కు పంపడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడుతున్నాయి. అవినాష్ రెడ్డి తన పీఏ ఫోన్ నుంచి వర్రాతో రెగ్యూలర్ గా టచ్లో ఉంటున్నట్లుగా గుర్తించారు. దీంతో ఆ పేఏను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే పీఏను కూడా దాచి పెట్టేశారు అవినాష్ రెడ్డి. తర్వాత ఏమీ తెలియదన్నట్లుగా మీడియా ముందుకు వచ్చారు.
వర్రా రవీంద్రారెడ్డి పోలీసులకు చిక్కారో లేదో స్పష్టత లేదు. రెండురోజుల కిందట వర్రాను మహబూబ్ నగర్ లో అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరిగింది . కానీ చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారని పోలీసులు ప్రకటించారు. కానీ పోలీసుల అదుపులోనే ఉన్నారని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు మొదటి నుంచి వర్రా విషయంలో ఓ వ్యూహం ఫాలో అవుతున్నాయి. అరెస్టు చేయకపోయినా చేశారని మీడియాకు తప్పుడు లీకులు ఇస్తున్నారు. ఆయన విషయంలో వైసీపీ ఏదో ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.