వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు వెళ్లే ముందు ఎంపీ అవినాష్ రెడ్డి.. సీఎం జగన్ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఇందుకోసం ఆయన లోటస్ పాండ్లోని షర్మిల నివాసానికి వచ్చారు. ఏ అంశాలపై చర్చించడానికి వచ్చారో స్పష్టత లేదు కానీ.. ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారని వైఎస్ జగన్ భార్య భారతి నిర్వహిస్తున్న సాక్షి మీడియా ప్రకటించింది. అయితే వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ విషయంలో కుటుంబసభ్యుల మధ్య వివాదాలున్నాయన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది.
వివేకా హత్య కేసులో నిందితుల్ని రక్షిస్తున్నారన్న అనుమనంతోనే జగన్ కు .. కొంత మంది కుటుంబ సభ్యులు దూరం జరిగారని చెబుతున్నారు. షర్మిల కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి విజయమ్మతో భేటీ కావడం వైసీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. మరో వైపు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్లే ముందు సీబీఐ అధికారులకు షరతులు పెడుతూ లేఖలు రాశారు.
వివేకానంద రెడ్డి కేసు ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని …పని గట్టుకొని ఓ వర్గం మీడియా తనపై లేని పోని కథనాలను ప్రచారం చేస్తోందని చె ..తప్పు దోవబట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని …అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని కోరారు. తనతోపాటు ఒక న్యాయవాది వెంటే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీనిపై సీబీఐ అధికారుల స్పందనపై స్పష్టత లేదు.