వైఎస్ వివేకా హత్య కేసులో చార్జిషీట్ దాఖలైన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి దర్యాప్తు ఎలా చేయాలో చెబుతూ మరోసారి లేఖ పంపారు. ఇటీవల సీబీఐకి కొత్త చీఫ్ వచ్చారు. ఆయన పేరు ప్రవీణ్ సూద్. అందుకే కొత్తగా లేఖ రాశారు అవినాష్ రెడ్డి. తాను రాసిన లేఖలో వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో రామ్‌సింగ్ దర్యాప్తు చేశారని ఆరోపించారు. రామ్‌సింగ్ చేసిన దర్యాప్తు తీరుని సమీక్షించాలని అవినాష్‌రెడ్డి లేఖలో కోరారు.
సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్షీట్ల ఆధారంగా లేఖ రాసినట్లుగా అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలు లేఖలో ప్రస్తావించారు. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్‌సింగ్ విచారణ జరిపారని అవినాష్‌రెడ్డి చెప్పుకొచ్చారు. రెండో భార్య పేరిట ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదని ఎంపీ… సీబీఐ కొత్తగా ఎలా విచారణ చేయాలో ఐడియా ఇచ్చారు. మున్నా లాకర్లో నగదకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని అవినాష్‌రెడ్డి కొత్తగా సీబీఐనే ప్రశ్నించారు. విచారణలో రామ్‌సింగ్ చేసిన తప్పులని సవరించాలని నిజమైన నేరస్తుల్ని పట్టుకొని న్యాయం చేయాలని సీబీఐ డైరెక్టర్ని అవినాష్ రెడ్డి కోరారు.
ఇవన్నీ సరే కానీ వాళ్లెవరో హత్య చేసి పారిపోతే.. ఎందుకు సాక్ష్యాలను తారు మారు చేయాల్సి వచ్చింది.. ? బయట ప్రపంచానికి హత్య గురించి తెలియక ముందే ఎలా తెలిసింది ? గుండెపోటుగా చూపించి ఎందుకు ఫిర్యాదు కూడా చేయనివ్వలేదు ? ఇవన్నీ కూడా లేఖలో వివరించి ఉంటే… అవినాష్ రెడ్డి .. సీబీఐకి మరింత సాయం చేసి ఉండేవారనే సెటైర్లు కూడా పడుతున్నాయి. హత్య చేసిన వాడే.. తప్పించుకోవానికి సాక్ష్యాలు చెరిపేస్తాడు. తప్పించుకోవడానికే కథలు చెబుతాడు… ఇది అందరికీ తెలిసిన క్రైమ్ ప్రిన్సిపల్. ఈ లాజిక్ అవినాష్ రెడ్డి ఎందుకు మిస్సవుతున్నారో.. మిస్సవుతున్నట్లుగా నటించి అందర్నీ మభ్య పెట్టాలనుకుంటున్నారో స్పష్టత రావాల్సి ఉంది.