తుది తీర్పు ఇచ్చే వరకూ అవినాష్ రెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిన ధైర్యంతో అవినాష్ రెడ్డి సీబీఐని పూచిక పుల్లలా చూస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే 15వ తేదీన సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ నేటి విచారణలో సీబీఐ ఎదుట హాజరు కావాలా వద్దా అన్నది సీబీఐనే అడగాలని హైకోర్టు చెప్పింది. దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మంగళవారం సీబీఐ విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి లేఖ రాశారు. .పార్లమెంటు సమావేశాలు ఉన్నందున హాజరుపై మినహాయింపు ఇవ్వాలని కోరారు. అవినాష్ లేఖ పై సీబీఐ ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.
ఉదయం అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని చెప్పింది కానీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మాత్రం తదుపరి చర్యలు వద్దని తుది తీర్పు ఇస్తామని చెప్పింది. ఆ తుది తీర్ప ఎప్పుడు వస్తుందో కానీ అప్పటి వరకూ అవినాష్ రెడ్డి అరెస్ట్ లేనట్లే. అయితే వీరిద్దర్నీ అరెస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని సీబీఐ చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంతో అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
అరెస్ట్ ఉండదు కాబట్టి ఇక సీబీఐ విచారణకు వెళ్లకపోయినా పర్వాలేదనుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాల సాకు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు అసలు హాజరు కారు. ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో లోక్ సభలో అతి తక్కువ అటెండెన్స్ ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయన పార్లమెంట్ సమావేశాల హాజరు 30 శాతమే. ఇక చర్చల్లో పాల్గొనడమే ఉండదు. ప్రశ్నలు కూడా అడగరు. కానీ ఇప్పుడు విచారణ తప్పించుకోవడానికి పార్లమెంట్ సమావేశాలను కారణంగా చూపిస్తున్నారు. న్యాయవ్యవస్థను అడ్డం పెట్టుకుని విచారణలు ఎలా ఆలస్యం చేసుకోవాలో.. ఎలా అరెస్టులు కాకుండా తప్పించుకోవాలో వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియవన్న విమర్శలు ఇలాంటి వాటి వల్లే వస్తున్నాయి.