ప్రతిభావంతులకు పద్మ అవార్డులు అభినందనీయమే గాని వాటిలో రాజకీయ ప్రమేయాలే చిరాకు తెప్పిస్తాయి. తద్వారా వాటి విలువ తగ్గడంతో వచ్చిన వారిలో అర్హులు కూడా తగినంత ఆనందం పొందకుండా చేస్తాయి. మహానటుడు నాయకుడు ఎన్టీఆర్ విషయంలో జరిగిందే ఈ రాజకీయాలకు గొప్ప ఉదాహరణ. ఎన్టీఆర్ ఏఎన్నార్లు తెలుగు సినిమాకు రెండు కళ్లు అంటుంటారు. వారిద్దరికి కొంత ఆలస్యంగానే ఒకేసారి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. అప్పటికి ఇంకా ఇంత రాజకీయం ముదిరిపోలేదు. తర్వాత బహుశా పదేళ్లకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి అక్కడా సూపర్ హీరో అయిపోయారు. కాని కాంగ్రెస్కు మాత్రం పెద్ద విలన్ కదా.. ఇక అప్పటినుంచి ఆయనకు అవార్డులు ఆగిపోయాయి. అక్కినేని నాగేశ్వరరావుకు పద్మ విభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే కూడా వచ్చాయి. ఆయనకు రావడం మంచిదే గాని ఈయనకెందుకు ఇవ్వలేదంటే సమాధానం వుండదు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నట ప్రతిభ మాసిపోతుందా లేక అదనపు శోభ సంతరించుకుంటుందా?
ఇద్దరు తెలుగు నటుల సంగతే కాదు తమిళంలో ఇద్దరు శివాజీ ఎమ్జీఆర్ల సంగతీ అంతే. శివాజీ కాంగ్రెస్ వైపు వున్నారు గనక చాలా పద్మశ్రీ పద్మభూషణ్ అన్నీ వచ్చాయి గాని ఎమ్జీఆర్కు ఏమీ రాలేదు. కాని ఆయన మరణం తర్వాత అన్నా డిఎంకె కాంగ్రెస్కు చేరువ కాగానే రిక్షారాముడు అనే అతి సాధారణ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడై పోయాడు. అలాటివి ఎన్టీఆర్ ఏఎన్నార్లకు డజన్లకొద్ది వుంటాయి. మరణానంతరం ఎమ్జీఆర్ ఏకంగా భారత రత్న అవార్డు పొందారు..కాని కేంద్రంతో ఎమ్జీఆర్ సాన్నిహిత్యం ఇంకా చెప్పాలంటే విధేయత ఆ స్థాయికి తీసుకెళ్లింది. నటుల్లో భారత రత్న పొందింది ఆయన ఒక్కడే అనుకుంటాను.
రజనీ కాంత్ నిస్సందేహంగా అత్యధిక ప్రజాదరణ గల హీరో. నాకూ ఇష్టమే. కాని మోడీ ప్రధాని అభ్యర్థి కాగానే ఆయననే కలుసుకోవడానికి దీనికి సంబంధం లేదని చెప్పలేం. దీన్ని బట్టి ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోతారని కొందరు జోస్యాలు చెబుతున్నారు గాని అనుమానమే. ఇప్పటికి చాలాసార్లు అలాటి భావన కలిగించి వెనక్కు తగ్గారు. భాషాలో ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే.. రాజకీయాల్లో మాత్రం ఆయన వంద చెప్పినా ఒక్కటి కూడా చేయలేదు. చిరంజీవికి కూడా మిగిలిన చాలా మందికంటే పెద్ద అవార్డులు రావడం వెనక ఆయన రాజకీయ మొగ్గు ప్రభావం లేదని చెప్పలేము. ఇంద్ర విజయోత్సవ సభలో చంద్రబాబు వెంకయ్య నాయుడు కూడా ఆయనను మరీ మరీ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. స్వంత పార్టీ ప్రయోగం తర్వాత కాంగ్రెస్లో కలసి పోయారు.ఇప్పుడేం చేస్తారన్నది వూహాగానంగానే వుంది.
మళ్లీ అవార్డుల దగ్గరకు వస్తే నిస్సందేహంగా వాటికి రాజకీయాలు వుంటాయి. దేశం కోసం సర్వం అర్పించిన సుందరయ్య జ్యోతి బాసు వంటి ఒక్క కమ్యూనిస్టు నేతనైనా వీరు పరిగణనలోకి తీసుకున్నారా? భగత్ సింగ్ను ఎప్పుడైనా పరిశీలించారా? చెప్పాలంటే చాలా వున్నాయి. ఆ యోధులు ఎలాగూ ఈ అవార్డులు ఆశించరు. వచ్చినవే ఆమోదించలేదు కూడా.