దేశంలో యాక్యురసీ రేట్ ఎక్కువగా ఉన్న నమ్మకమైన సర్వే సంస్థల్లో ఒకటిగా ఉన్న యాక్సిస్ మై ఇండియా ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఒక రోజు ఆలస్యంగా ప్రకటించింది పూర్తి డేటాతో సంపూర్ణ విశ్లేషణతో ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో భారతీయ జనతా పార్టీ కంఫర్టబుల్ గా విజయాన్ని అందుకోబోతోందని తేల్చారు. బీజేపీకి మొత్తం 70 సీట్లలో 45 నుంచి 55 సీట్లు వస్తాయని యాక్సిస్ సంస్థ అంచనా వేసింది. నలభై ఎనిమిది వరకూ ఓటు షేర్ వస్తుందని తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి 42 శాతం ఓట్ షేర్ వస్తున్నా ఫలితాల్లో మాత్రం భారీగా సీట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టమయింది. ఆ పార్టీకి పదిహేను నుంచి ఇరవై ఐదుసీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. గత రెండు సార్లు ఆమ్ ఆద్మీపార్టీ ఢిల్లీని స్వీప్ చేసింది. ప్రతిపక్షం కూడా లేకుండా అరవైకిపైగా సీట్లు గెల్చుకుంది. కానీ ఈ సారి మాత్రం గట్టిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తేల్చింది.
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏ మాత్రం కోలుకునే అవకాశం లేదని యాక్సిస్ కూడా అంచనా వేసింది. ఆ పార్టీకి ఏడు శాతం ఓట్లు వచ్చినా.. ఒక్క సీటు కూడా రావడం కష్టమేనని అంచనా వేసింది. ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయి. ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ తప్ప అన్నీ ఢిల్లీలో బీజేపీ విజయాన్నే అంచనా వేశాయి. అసలు ఫలితాలు ఎనిమిదో తేదీన ఉదయం పది గంటల కల్లా తేలిపోనున్నాయి.