శివ కార్తికేయన్ కథల ఎంపిక బాగుంటుంది. ఎవరూ టచ్ చేయని పాయింట్లతో సినిమాలు తీసి, హిట్లు కొడుతుంటాడు. తమిళనాట సక్సెస్ రేషియో ఎక్కువగా ఉన్న హీరోల్లో తనొకడు. అయితే తాజా సినిమా ‘అయలాన్’ ఆయన్ని, ఆయన అభిమానుల్ని నిరాశ పరిచింది. సంక్రాంతికి తమిళ నాట భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఇది. టాక్ అంతంత మాత్రమే. ఈ వారంలో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి పార్ట్ 2 గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కేవలం గ్రాఫిక్స్ కోసమే రూ.50 కోట్లు వెచ్చించినట్టు నిర్మాతలు ప్రకటించారు.
ఓ గ్రహాంతర వాసి భూమిపైకొచ్చి, హీరోతో స్నేహం చేయడమే కథ. పాయింట్ పరంగా కొత్తగా ఉన్నా, ట్రీట్మెంట్ మాత్రం నిదానంగా సాగి, నిరాశ పరిచింది. పార్ట్ 2 కోసం కొన్ని ట్విస్టులు ఉంచేయడం, కథని పూర్తిగా రివీల్ చేయకపోవడం ఈ సినిమాలోని ప్రధాన లోపాలుగా తమిళ రివ్యూలు చెప్పుకొచ్చాయి. కాకపోతే సంక్రాంతికి విడుదల చేయడం వల్ల, శివ కార్తికేయన్ ఇమేజ్ వల్ల ఈ సినిమా ఆర్థికంగా నిలదొక్కుకొంది. పార్ట్ 2 కథపై హీరోకి బాగా నమ్మకం ఉండడడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రానికి సీక్వెల్ తీయాల్సిందే అని చెబుతున్నాడట. నిర్మాతలు కూడా సరే అంటూ రంగంలోకి దిగిపోయారు. ఈ యేడాది చివర్లో ‘అయలాన్ 2’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఓ సినిమాకి బిలో యావరేజ్ రేటింగులు వచ్చినా పార్ట్ 2 వైపు నిర్మాతలు అడుగులు వేసిన విషయంలో బహుశా ఈ సినిమాదే రికార్డేమో..?