ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అయోధ్య కేసుపై భాజపా చాలా ఆశలు పెట్టుకుందనేది పూర్తిగా కాదని లేని అంశం! అందుకే, ఆ కేసు విచారణ ఇకపై వేగవంతం అవుతుందంటూ భాజపాతోపాటు అనుబంధ సంఘాలు వేచి చూశాయి. వచ్చే ఎన్నికల్లో కూడా దీన్నే ప్రధానాంశంగా భాజపా మార్చుకునే అవకాశం ఉందన్న తరుణంలో సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు అనేది కొంతమంది అభిప్రాయం. ఈ కేసును జనవరి మొదటి వారానికి వాయిదా వేస్తూ త్రిసభ్య ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది. అంతేకాదు, ఇది ఇప్పటికిప్పుడు వెంటనే విచారణ చేపట్టాల్సిన అత్యవసర అంశం కాదనీ, దీని కంటే ప్రాధాన్యతో కూడుకొన్నవి చాలా ఉన్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం!
గడచిన మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైందిగా ఉంటూ వస్తోంది ఈ కేసు. దీన్ని అడ్డం పెట్టుకుని అత్యధిక రాజకీయ లబ్ధి పొందినవారు ఎవరనేది అందరికీ తెలిసిందే. నిజానికి, ఈ 2.77 ఎకరాల భూమికి సంబంధించి 2010లోనే అలహాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మూడు సంస్థలకూ సమాన హక్కులు ఇస్తూ ఇచ్చిన తీర్పుపై సవాలు చేస్తూ సుప్రీం కోర్టులు చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, పెండింగ్ ఉన్న కేసులపై వరుసగా విచారణ చేపడతామనీ, దానికి సంబంధించి సోమవారం సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంటుందని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అనూహ్యంగా దీన్ని జనవరికి వాయిదా వేసేసింది సుప్రీం కోర్టు.
నిజానికి, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భాజపాకి ఒక బలమైన ప్రచారాస్త్రం కావాలి. అది కూడా ఎలాంటిదంటే… మోడీ పాలనలోని వైఫల్యాలను మరిపించే విధంగా ఉండాలనడంలో సందేహం లేదు! అలాంటి అవసరం ఏర్పడితే.. వారు ఆశ్రయించేది ఇలాంటి సున్నితమైన అంశాలనే కదా! కానీ, తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు భాజపాతోపాటు అనుబంధ సంఘాల స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. అయితే, దీనిపై కేంద్రం ఆర్డినెన్స్ దిశగా ఏవైనా ప్రయత్నాలు చేస్తుందా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్ ను పరివార్ తెరమీదికి తెస్తోంది. ఒకవేళ ఆ దిశగా భాజపా సర్కారు ఏమైనా ప్రయత్నాలు చేసినా.. అప్పుడూ వివాదాస్పదం అయ్యేందుకే ఆస్కారం ఎక్కువ. ఆ పరిస్థితి ముందే కనిపిస్తోంది..! అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై నిజంగా మోడీ సర్కారుకు దమ్ముంటే ఆర్డినెన్స్ తీసుకుని రావాలంటూ సవాల్ చేశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. మొత్తానికి, ఈ అంశాన్ని ఎలాగోలా రాజకీయంగా మైలేజ్ తీసుకునేందు కొన్ని ప్రయత్నాలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.