మాట్లాడితే దేవుడు, ప్రజలు ఉన్నారనే జగన్ రెడ్డికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆయన భాషలోనే సమాధానం ఇచ్చారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో దేవుళ్లు అయిన ప్రజలు ఇవ్వలేదని దాన్ని పూజారి లాంటి తన వద్ద నుంచి ఎలా ఆశిస్తారని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ చేసిన రచ్చపై స్పీకర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా తమకు దక్కకపోవడంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. స్పీకర్ సీటుపై దురుద్దేశాన్ని ఆపాదించడం సభ నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయనా క్షమించి వదిలేస్తున్నాన్నారు. నిబంధనల ప్రకారం మొత్తం 175 మంది సభ్యులుండగా, 10 శాతం సీట్లు అంటే 18 స్థానాలు ఆ పార్టీ నెగ్గాల్సి ఉంటుందన్నారు. అలా కాని పక్షంలో ప్రతిపక్ష హోదా ఉండదని వైఎస్ జగన్ గతంలో అసెంబ్లీలో చెప్పారని అయ్యన్న పాత్రుడు గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తన వరకు వచ్చేసరికి నిబంధనలు తుంగలో తొక్కి, ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగన్ రాసిన లేఖ కూడా దురద్దేశపూర్వకంగానే ఉందన్నారు. గత ఏడాది జూన్ 24న ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ, బెదిరింపులతో జగన్ తనకు లేఖ రాశారని, ఆపై హైకోర్టును సైతం ఆశ్రయించారని స్పీకర్ పేర్కొన్నారు. కోర్టులో సైతం పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా స్థితిలో ఉందని కానీ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని స్పీకర్ వ్యాఖ్యానించారు. కనీసం వైసీపీ సభ్యులు అయినా సభకు వచ్చి, సమస్యలపై ప్రశ్నించాలని.. తమకు తోచిన సలహాలు, సూచనలు చేయాలని స్పీకర్ పిలుపునిచ్చారు. సభకు వచ్చి హుందాగా వ్యవహరించి తమ నియోజకవర్గం కోసం ప్రశ్నించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.