కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు మాత్రమే అయింది. అప్పుడే… టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల గురించి మట్లాడేస్తున్నారు. పొత్తుల గురించి కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ, జనసేనలకు దూరం అవడం వల్లే ఘోరపరాజయం పాలయినట్లుగా.. టీడీపీ నేతలు ఇప్పటికే రియలైజ్ అయ్యారు. అందుకే.. ఇప్పటి నుంచి వారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు… 2024 పొత్తుల గురించి.. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడి.. 2024లో… తెలుగుదేశం , జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. అయితే ఎన్నికలు 2024లోనే కాదని.. ఇంకా ముందే రావొచ్చని కూడా విశ్లేషించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. జమిలీ ఎన్నికలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారని…గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అనూహ్యంగా రాజకీయాలు మారబోతున్నాయని అంటున్నారు.
అధికారం ఉందన్న గర్వంతో.. సామాజిక సమీకరణాలు లెక్కలు.. ఇంత అంశాలను లెక్కలోకి తీసుకోకుండా.. తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేనలను దూరం చేసుకుంది. భారతీయ జనతా పార్టీనే విలన్‌గా చూపించి ఎన్నికల బరిలోకి దిగింది. చివరిలో జనసేన పార్టీని దగ్గర తీసుకోవాలని… చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే.. సమయం మించిపోయింది. పవన్ కల్యాణ్.. ఒంటరి పోటీకి దిగి.. తన బలమెంతో నిర్ణయించుకోవాలని డిసైడయ్యారు. దాంతో.. పవన్ కల్యాణ్‌కు.. ఆరు శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ సంప్రదాయ ఓటర్లు కూడా.. ఆ పార్టీకి వేయకుండా.. బీజేపీని విలన్ ప్రొజెక్ట్ చేసిన టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి వేశారు. ఫలితంగా… వైసీపీ వైపు ఓట్లు కన్సాలిడేట్ అయ్యాయి. ఫలితంగా యాభై శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి.
ఈ ఫలితాలతో టీడీపీ నేతలకు వాస్తవం అర్థం అయింది. అభివృద్ధి చేయడం బాధ్యతే కానీ.. దాన్నుంచి రాజకీయ ప్రయోజనాలు ఆశించడం అత్యాశే అవుతుందన్న అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే.. వారు చేసుకుంటున్న విశ్లేషణల్లో.. ఇతర వర్గాలను దగ్గర తీసుకోవాలంటే… కొంత సడలింపు తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రకటన బయటకు వచ్చిందని అనుకోవచ్చు. అయినా… వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే.. మాట్లాడటం.. చాలా తొందరపాటే అవుతుంది. కానీ టీడీపీ నేతల్లో మాత్రం చేసిన తప్పు.. మళ్లీ చేయకూడదన్న ఆత్రం కనిపిస్తోంది.