అయ్యప్పనుమ్ కోషియుమ్..
– ఈ మలయాళ చిత్రం గురించే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. మలయాళంలో ఎప్పుడూ సరికొత్త కథలు వస్తుంటాయి. చాలా చిన్న చిన్న లైన్స్ని పట్టుకుని వాళ్లు అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఓరకంగా ప్రపంచమంతా కొరియన్ సినిమాలవైపు ఆసక్తిగా చూసినట్టు, మనవాళ్లంతా మలయాళం వైపు దృష్టిసారిస్తుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి రాబోతున్న కథే.. అయ్యప్పనుమ్ కోషియుమ్.
ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ కోసం రీమేక్ చేయనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఓ మాజీ మిలటరీ అధికారికీ, ఓ పోలీస్ ఆఫీసర్కీ మధ్య నడిచే ఇగో క్లాష్ ఇది. ఇలాంటి కథలు ఎక్కడ తీసినా ఇలాంటి కథలు వర్కవుట్ అవుతాయి. కాకపోతే… అసలేమాత్రం కమర్షియల్ హంగుల కోసం ఆలోచించకూడదు. తెలుగులో ఈ సినిమా తీస్తే.. అక్కడే సమస్య వచ్చేస్తుంది. మలయాళంలో బీజూ మేనన్ పోషించిన పాత్ర లో బాలయ్య కనిపించడం దాదాపుగా ఖాయం. బాలయ్య చేయాల్సివస్తే… కమర్షియల్ లెక్కల గురించి ఆలోచించకుండా ఉంటారా? మలయాళంలో ఎంత `రా`గా తీశారో, అంతే `రా`గా ఇక్కడ తీయగలరా? అనేది పెద్ద ప్రశ్న.
ఈ కథని బి.గోపాల్ చేతిలో పెట్టాలని భావిస్తున్నట్టు టాక్. నిజానికి ఇది బి.గోపాల్ శైలి సినిమా కాదు. ఇది వరకు ఈ తరహా సెన్సిబుల్ సినిమాల్ని ఆయన తీయలేదు కూడా. కొరటాల శివ, దేవకట్టా లాంటి దర్శకులు ఇలాంటి కథల్ని బాగా డీల్ చేస్తారు. చేయగలరు. ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా బి.గోపాల్ ఏ మేరకు ఈ చిత్రాన్ని రూపొందించగలరు అనేది మరో ప్రశ్న. రెండో హీరో ఎవర్ననదీ కీలకమే. మలయాళంలో ఫృథ్వీరాజ్ పోషించిన పాత్రలో ఓ యువ హీరో కనిపిస్తే బాగుంటుంది. ఫృథ్వీ రాజ్ మలయాళంలో ఓ స్టార్. ఆ స్థాయి ఉన్న హీరోనే తెలుగులోనూ తీసుకురావాలి. అప్పుడే దీనికి మల్టీస్టారర్ లుక్ వస్తుంది. మలయాళంలో దాదాపు 3 గంటల నిడివి ఉన్న సినిమా ఇది. అంత లెంగ్త్ ఇక్కడ కష్టమే. సినిమాని వీలైనంత షార్ప్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా కీలకమైన విషయాలు. రీమేక్ ఫలితంపై ప్రభావితం చేసే అంశాలు. వీటిని వీలైనంత వరకూ దృష్టిలో పెట్టుకుని తెలుగీకరిస్తే.. తప్పకుండా తెలుగులో మరో మంచి రీమేక్ చూసే అదృష్టం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది.