కేసీఆర్ అంతే! ఆయన అనుగ్రహం ముఖ్యం కానీ.. ఎన్నికల్లో ప్రజలు ఆమోదించినా తిరస్కరించినా, ప్రత్యర్థులు తిట్టిపోసినా, కొట్టినా ఏం జరిగినా సరే.. పరిస్థితి దివ్యంగా జరిగిపోతుంది. తన కరుణ ప్రసరించిన తర్వాత.. ఇక అవతలి వారు దివ్యంగా ఉండాలనే ధోరణి కేసీఆర్‌లో కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కార్పొరేటర్‌గా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ… డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ తనయుడు ఆజం ఆలీకి హైదరాబాద్ నగర కార్పొరేషన్ లో కోఆప్షన్ సభ్యత్వాన్ని కట్టబెట్టబోతున్నట్లుగా పార్టీలో పుకార్లు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం కుమారుడు ఆజం ఆలీ కూడా పాతబస్తీ నుంచి కార్పొరేటర్‌గా పోటీచేశారు. ఆయన విజయావకాశాలు ఎలా ఉండేవో తెలియదు గానీ.. మొత్తానికి పోలింగ్ రోజున సాయంత్రం మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బలాల ఆజం పై దాడికి దిగి కొట్టడం జరిగింది. మహమూద్ ఆలీ, ఇల్లు ఆఫీసులపై దాడిచేసిన మజ్లిస్ గూండాలు విచ్చలవిడిగా విధ్వంసం సృష్టించడంతో పాటూ డిప్యూటీ కొడుకును కొట్టారు.
అయితే, ఈ దాడి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఫలితాలు వచ్చే సమయానికి ఆజం ఆలీ ఓడిపోయారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కొడుకు కార్పొరేటర్‌గా కూడా గెలవలేదు. నగరమంతా తెరాస హవా చెలరేగినా పాతబస్తీలో ఏమీ పనిచేయలేదనడానికి ఇది ఒక నిదర్శనం. అయితే పార్టీకోసం దెబ్బలు తిన్నందుకు ఆజం ఆలీ మీద కేసీఆర్‌కు జాలి పుట్టినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన కార్పొరేటర్‌గా ఎంట్రీ లేకపోయినప్పటికీ.. కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించి గ్రేటర్ పాలనలో చోటు ఇవ్వబోతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో అయిదుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. వీరిలో విధిగా ఇద్దరు మైనారిటీ వర్గాలకు చెందిన వారు కూడా ఉండాలి. ఆ నేపథ్యంలో ఆజం ఆలీకి ఒక చాన్సు ఇవ్వడానికి సీఎం అంగీకరించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాస్ కరుణ ఉంటే.. ఇక ఎన్నికల్లో ఓడిపోయినా దిగులుండదని అంతా అనుకుంటున్నారు.