టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్.. కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం కారణంగా.. సుదీర్ఘ కాలం పాటు … బీసీసీఐ నిరాదరణకు గురైన … ఆయన చివరికి… అన్నింటా క్లీన్ చిట్ పొంది.. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా పోటీ చేసి..విజయం సాధించారు. హెచ్‌సీఎలో మొత్తం 227 ఓట్లు ఉండగా.. 223 ఓట్లు పోల్ అయ్యాయి. అజారుద్దీన్‌కు 146 ఓట్ల మెజార్టీ వచ్చింది. హెచ్‌సీఏలో మంచి పట్టు ఉన్న మాజీ ఎంపీ వివేక్ నామినేషన్ తిరస్కరించడంతో అజరుద్దీన్‌కు తిరుగులేకుండా పోయింది.
అజరుద్దీన్ హెచ్‌సీఏ పీఠం కోసం 2017లోనే ప్రయత్నించాడు. నామినేషన్ కూడా దాఖలు చేశాడు. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో బీసీసీఐ నుంచి క్లీన్చిట్ రాకపోవడంతో అతడి నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ సారి మాత్రం.. అన్ని రకాల క్లీన్ చిట్లు పొంది.. బీసీసీఐలో పదవులు పొందడానికి అర్హతను తెచ్చుకున్నారు. అందరి కంటే ముందే.. హెచ్‌సీఏలో ఉన్న కీలక వర్గాలు అర్షద్, శివ్లాల్ యాదవ్, శేష్ నారాయణ వర్గాల నుంచి మద్దతు సంపాదించుకున్నారు. దాంతో ఆయన గెలుపు సులువైంది. అంతర్జాతీయ క్రికెట్ లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించి.. మణికట్టు మాయాజాలంతో బ్యాటింగ్ చేసే అజహర్ పై 2000 సంవత్సరంలో బీసీసీఐ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జీవిత కాల నిషేధం విదించింది.
దీన్ని సవాలు చేస్తూ అజహర్ కోర్టును ఆశ్రయించగా ఏపీ హై కోర్టు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో పాటుగా అజహర్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఓ సారి ఎంపీగా గెలిచారు. కాకపోతే.. యూపీ నుంచి గెలిచారు. సొంత రాష్ట్రం నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్న అజహర్.. హెచ్‌సీఎలో విజయంతో కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లోనూ ఆయన యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి.