చిత్రసీమలో అసలే ఈగోల గోల ఎక్కువ. హీరోకీ – మీడియా రంగానికీ, హీరోకీ – హీరోకీ, హీరోకీ – దర్శకుడికీ… ఇలా ప్రతీ చోటా ఓ వారధి అవసరం. వాళ్లనే పీఆర్వోలు అంటుంటారు. అలాంటి పీఆర్వోరంగానికి మకుటం లేని మహారాజుగా వెలిగారు.. బీఏ రాజు. పాత్రికేయుడిగా ప్రవేశించి, పీఆర్వోగా మారి, నిర్మాతగా ఎదిగి చిత్రసీమలోని స్టార్ నుంచి.. కొత్తగా వచ్చిన పాత్రికేయుడి వరకూ అందరి చేతా `అజాత శత్రువు` అనిపించుకున్న ఘనత.. రాజుకి దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శుక్రవారం అర్థరాత్రి.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాజు గుండె ఆగింది. మీడియా రంగంలో ఓ మహా ప్రస్థానం ముగిసింది.
తెలుగు సినీ పాత్రికేయ లోకంలో రాజుది విశిష్ట స్థానం. కృష్ణ అభిమానిగా పరిశ్రమకు వచ్చి, ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ – నిర్మాతగా ఎదిగి, సినిమా మీడియా రంగానికే మూలస్థంభంగా మారిన వైనం నభూతో.. నభవిష్యత్త్. దాదాపు వేయి చిత్రాలకు పీఆర్వోగా పనిచేశారు. `సూపర్ హిట్` ని స్థాపించి, అగ్ర సినీ పత్రికల్ని సైతం గడగడలాడించారు. ఓ సినిమాకి పీఆర్వోగా పనిచేసినా, పక్క సినిమా గురించి చెడుగా మాట్లాడకపోవడం, ప్రతీ హీరోనీ తన హీరోలానే భావించి గౌరవించడంతో… బిఏ రాజు అన్ని కాంపౌండ్ లకూ దగ్గరైపోయారు. రాజు నోటి నుంచి `ఫ్లాప్` అనే మాటే వచ్చేది కాదన్నది ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తుల మాట. ఫ్లాప్ సినిమాలోనూ… ప్లస్ పాయింట్లనే ప్రస్తావించేవారు. కాకపోతే… చిత్రసీమలోని హీరోలకు జన్యువున్ రిపోర్ట్ రాజు దగ్గర నుంచే వెళ్లేది. ఏ సినిమా ఏ సెంటర్లో ఎంత వసూలు చేసింది, ఏ సినిమా ఏ కేంద్రంలో ఎన్ని రోజులు ఆడింది? రిలీజ్ డేట్ ఏమిటి? అనే విషయాలు ఆయన ఫింగర్ టిప్స్‌పై ఉండేవి. `రాజూ… మన సినిమా ఎప్పుడు విడుదలైంది?` అని చాలామంది నిర్మాతలూ, హీరోలు రాజునే ఫోన్ చేసి అడిగేవారంటే.. రాజు జ్ఞాపక శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవొచ్చు.
కృష్ణ కుటుంబం అంటే బిఏ రాజుకి చాలా అభిమానం. కృష్ణ కూడా రాజుని కుటుంబ సభ్యుడిగా చూసేవారు. కృష్ణ సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు రాజు… ఆయన వెంటే ఉండేవారు. చిన్నప్పటి మహేష్ ని ఎత్తుకుని ఆడించింది రాజునే. చాలాసార్లు కృష్ణ సినిమాకు టైటిల్ కోసం వెదుకుతున్నప్పుడు చటుక్కున టైటిల్ చెప్పేసేవాడు. రాజు చెప్పిన టైటిల్ నే కృష్ణ ఖరారు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ తరవాత మహేష్ హీరోగా మారాడు. ఇప్పటి వరకూ మహేష్ కి వ్యక్తిగత పీఆర్వో రాజునే. జర్నలిస్టులకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడేంత చనువు… స్నేహం రాజుతోనే ఉన్నాయి. బిఏ రాజు మృతిచెందిన వార్త తెలిసిన వెంటనే మహేష్ ట్విట్టర్లో తన సంతాపం తెలియజేశాడు. బిఏ రాజుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. అదీ వాళ్ల అనుబంధం. మహేష్ మాత్రమే కాదు.. ప్రభాస్, వెంకటేష్, విశాల్.. వీళ్లందరికీ కెరీర్ ముందు నుంచీ.. రాజునే పీఆర్వో.
జర్నలిస్టు కుటుంబానికి బిఏ రాజు పెద్ద దిక్కు. ఆనాటి సీనియర్ పాత్రికేయుల నుంచి, ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన కుర్రవాళ్ల వరకూ.. ఆయనతో అనుబంధం పెంచుకున్నవాళ్లే. ప్రతి ఒక్కరినీ పేరు పేరుతో పిలిచి, వాళ్ల మనసుల్లో సుస్థిరస్థానం ఏర్పాటు చేసుకున్నారు. సతీమణి, దర్శకురాలు బిఏ జయ మరణం.. రాజుని బాగా కృంగదీసింది. రెండేళ్ల నుంచీ.. పీఆర్వో వ్యవహారాల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే.. మళ్లీ కాస్త బిజీగా మారుతున్న తరుణంలో… హఠాత్తుగా ఆయన గుండె ఆగిపోయింది. తనయుడ్ని దర్శకుడిగా చూసుకోవాలన్న ఆశ ఆయనది. అది తీరినట్టే తిరింది. శివ దర్శకత్వం వహించిన `22` విడుదలకు సిద్ధమైంది. కానీ కరోనా కారణంతో విడుదల ఆగింది. ఆ సినిమా విడుదలై ఉంటే… తండ్రిగానూ ఓ సంతృప్తి లభించేది.