రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకి ఇచ్చిన హామీల జాబితాలు అందరికీ కంఠోపాటమే. అలాగే వాటి అమలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరి గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ వాటి గురించి కేంద్రమంత్రులే అపుడప్పుడు ఏవో స్టోరీలు చెపుతుంటే అందరూ ‘ఊ’ కొట్టి భారంగా నిట్టూర్పు విడిచి ఊరుకోవడం అందరికీ అలవాటయిపోయే ఉంటుంది.
తెలంగాణాకి కూడా ఇటువంటి ఒక సమస్య, దానికీ ఇటువంటి అవరోధాలున్నాయి. అదే హైకోర్టు విభజన. ఏపిలో హామీల అమలుకి ఒక్కో దానికి కేంద్రం ఒక్కో స్టోరీ చెపుతున్నట్లే, దానికీ ఒక స్టోరీ చెపుతూ రెండేళ్ళు దొర్లించేసింది. మరో మూడేళ్ళు దొర్లించేస్తే చాలు.
దీని గురించి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ‘రాజుగారు ఏడు చేపల కధ’ వంటి అందరికీ తెలిసిన స్టోరీని మళ్ళీ నిన్ననే చక్కగా చెప్పారు. తను దీని గురించి కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో మాట్లాడానని, వీలయినంత త్వరగా హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేయాలని తన అభ్యర్ధనను ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా సన్నాహాలు చేస్తోందని, దాని నిర్మాణం పూర్తయ్యేలోగా ఏపికి తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్ లో తగిన భవనాలు కేటాయించాలని తను తెలంగాణా ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్ళలోగా హైకోర్టు విభజన జరగాలని విభజన చట్టంలో ఉంది కనుక దానికి అనుగుణంగానే కేంద్రం తగిన చర్యలు తీసుకొంటుందని దత్తాత్రేయ చెప్పారు.
ఆయన స్టోరీ బాగానే రీప్లే చేసారు కానీ ‘అశ్వత్థామ హతః కుంజరః’ అన్నట్లుగా అసలు విషయాలేవీ చెప్పకుండా దాట వేశారు. విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ లో వేరే చోట ఏపి లేదా తెలంగాణా హైకోర్టుని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సాక్షాత్ హైకోర్టే చాలాసార్లు చెప్పింది. అలా చేయాలంటే ఆ విభజన చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పి చాలా కాలమే అయ్యింది కానీ ఆ పాయింటుని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంక అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం అయ్యేవరకు ఆగదలిస్తే మరో ఐదో పదేళ్లో ఆగాలేమో? ఎందుకంటే అమరావతిలో నిర్మాణ పనులు ఇంకా ఎప్పుడు మోదలవుతాయో ఎవరికీ తెలియదు. తప్పదంటే హైకోర్టుకి కూడా ఓ తాత్కాలిక భవనం కట్టుకోమని ఒత్తిడి చేయవచ్చు. విభజన చట్టంలో ఆ ‘మూడేళ్ళ క్లాజు’ గురించి బండారు దత్తాత్రేయ బాగానే క్యాచ్ చేసారు కానీ మూడేళ్ళలో విభజించకపోతే ఏమవుతుందో చెప్పలేదు. బహుశః దానికయినా పార్లమెంటులో చట్ట సవరణ తప్పదేమో? కనుక చివరికి ఏమని అర్ధం చేసుకోవాలంటే మళ్ళీ కొన్ని రోజుల తరువాత మరొకరు ఎవరో ఈ ఏడు చేపల కధ చెపితే విని ‘ఊ’ కొట్టాలని.