కక్షతో ఎదుటి వ్యక్తిని ఏదో చేసేశానని జగన్ అనుకుంటారు కానీ.. నిజానికి తనను తానే దెబ్బతీసుకున్నానని సరైన సమయంలో ఆయనకు తెలిసి వస్తుంది. చంద్రబాబును జైల్లో పెట్టి ఆయన ఏం సాధించారో ఆయనకు బాగా తెలుసు. తాజాగా గతంలో బీటెక్ రవిని అక్రమంగా జైల్లో పెట్టించినందుకు ప్రతిఫలంగా ఇప్పుడు ఆయన సాక్షిగా మారిపోయారు. ఇలా బూమరాంగ్ అవుతుందని తెలిస్తే ఆయనను అసలు జైల్లో పెట్టించే ప్రయత్నమే చేసేవారు కాదు.
చంద్రబాబునాయుడు కడప పర్యటనకు వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు వద్ద చిన్న గొడవ జరిగింది. అది జరిగిన ఆరేడు నెలల తర్వాత బీటెక్ రవిని అరెస్టు చేశారు. ఇంత కాలం పరారీలో ఉన్నారని ఇప్పుడు అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. బీటెక్ రవి ఆ ఆరు నెలల కాలంలో పులివెందులలోనే ఉన్నారు. పోలీసుల్ని కూడా కలిశారు. అలా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పుడే దస్తగిరి కూడా జైల్లో ఉన్నారు. దస్తగిరితో బెదిరించో.. తాయిలాలు చూపించో డీల్ కుదుర్చుకోవడానికి డాక్టర్ రూపంలో శివశంకర్ రెడ్డి కుమారుడు లోపలికి వెళ్లాడు. అయితే తాను దస్తగిరిని కలవలేదని చైతన్యరెడ్డి చెబుతున్నారు. కానీ ఆయన కలిశారని.. దస్తగిరి బ్యాంక్ లోకి వెళ్లడం తాను చూశారని బీటెక్ రవి సాక్ష్యం ఇచ్చారు.
ఆయన అప్పుడు జైల్లోనే ఉన్నారు మరి. దస్తగిరి ఉన్న బ్యారక్ ఎదురుగానే తనను ఉంచారని.. చైతన్యరెడ్డి లోపలికి వెళ్లడం చూశారని బీటెక్ రవి సాక్ష్యం ఇచ్చారు. దీంతో చైతన్యరెడ్డి నిండా మునిగినట్లయింది. వివేకా హత్యకేసులో అధికారాన్ని ఉపయోగించి అన్ని రకాలుగా కేసును ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. అందులో పై స్థాయి వరకూ కుట్రలు జరిగాయి. అవన్నీ చైతన్యరెడ్డి జైలు బెదిరింపుల నుంచి తీగలాగితే బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.