సినిమాలకు ఇచ్చినట్టు పీఆర్వోలకూ రేటింగు ఇస్తే.. ఆయనకు 5 కి 5 ఇవ్వాలి!
హీరోలకు ఇచ్చినట్టు.. పాత్రికేయులకూ బిరుదులు ఇస్తే.. ఆయన్ని `సూపర్ స్టార్` అనాలి.
సినిమాతో ఎవరి కెరీర్ అయినా పోలిస్తే… ఆయనది `సూపర్ హిట్టు`. ఇంకో మాటైతే.. ఇండ్రస్ట్రీ హిట్టు.
ఆయనెవరో కాదు. బిఏ రాజు. సినిమా వాళ్లకు ఈ పేరు సుపరిచితం. పాత్రికేయుడిగా, పీఆర్వోగా, నిర్మాతగా.. ఆయన ప్రయాణం అనితర సాధ్యం.
బిఏ రాజు.. కేవలం పీఆర్వోనే కాదు. అంతకు మించి. నిజానికి చిత్రసీమలోని పీఆర్వోలకు సైతం స్టార్ హోదా ఉందీ….అంటే అదంతా బిఏ రాజు చలవే. జనవరి 7.. ఆయన పుట్టిన రోజు.
****
ఓ పీఆర్వో ఏం చేస్తాడు? హీరో, లేదంటే ఆ సినిమా పబ్లిసిటీ బాధ్యత భుజాన వేసుకుంటాడు. అంతేగా..? కానీ… ఆ సినిమాకి రాజు పీఆర్వో అయితే.. అంతకు మించే పని ఉంటుంది.
`ఏమయ్యా రాజు.. మన సినిమాకి ఏ టైటిల్ పెడదాం` అని ఆ బాధ్యత ఆయనపైనే వదిలేసిన సందర్భాలెన్నో. అంతెందుకు.. `సూపర్ హిట్ మైగజైన్లో రాజు మన సినిమా టైటిల్ రాసేశాడు. అదే ఫిక్స్ చేసేయండి…` అని దర్శకులు చెప్పిన సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి.
`ఈ టైములో ఈ డైరెక్టరుతోనే సినిమా చేయడం ఉత్తమం` అని హీరోలకు మార్గ దర్శనం చేసిన రోజులు బిఏ రాజు జీవితంలో లెక్కపెట్టనన్నిసార్లు జరిగి ఉంటుంది.
`ఒక్కడు` అనే సినిమా అలా వచ్చింటే నమ్ముతారా? గుణశేఖర్ని నేరుగా మహేష్ దగ్గరకే తీసుకెళ్లి.. `గుణ శేఖర్ దగ్గర మంచి కథ ఉంది.. వినండి… కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది` అని చెప్పి `ఒక్కడు`లాంటి క్లాసిక్ రావడానికి బీజం వేసింది ఆయనే. అందుకే మహేష్ లాంటి వాళ్లకు రాజు అంటే అంత నమ్మకం. ఇది కేవలం మచ్చుక్కి మాత్రమే. ఇలాంటి సూపర్ హిట్ సినిమాల వెనుక.. బిఏ రాజు నీడలా ఉన్న సందర్భాలెన్నో.
సినిమా ఇండ్రస్ట్రీలో కాంపౌండ్ గోడలే కాదు, గొడవలూ బోలెడన్ని ఉంటాయి. ఓ హీరో పీఆర్వో అంటే.. మరో హీరో నీడని కూడా తాక కూడదు. ఆ షరతు.. బద్దలు కొట్టింది బీఏ రాజు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెగా కుటుంబానికీ ఆయనే కావాలి. దగ్గుబాటి, అక్కినేని, నందమూరి.. ఎక్కడంటే అక్కడ.. సర్వాంతర్యామి అనిపించుకున్నాడు. అందరు హీరోల తలలో నాలుకైపోయాడు. తమ సినిమాకి బీఏ రాజు పీఆర్వో అయినా కాకపోయినా.. ఆయన సలహాలు సూచనలూ తీసుకోవడం తప్పని సరి వ్యవహారం అయిపోతుంది.
పాత్రికేయులు పీఆర్వోలుగా మారడం సహజమేమో గానీ, పీఆర్వోలు నిర్మాతలుగా మారడం, హిట్లు కొట్టడం… ఓ చరిత్ర. ఆ చరిత్ర లిఖించింది కూడా బీఏ రాజునే. సహధర్మచారిణి జయతో విజయవంతమైన చిత్రాల్ని తెరకెక్కించారు. బిఏ రాజు అడిగితే ఏ హీరో అయినా కళ్లు మూసుకుని డేట్లు ఇచ్చేస్తాడు. `రాజు.. నువ్వు సినిమా చేయ్.. వెనుక మేముంటాం` అని వరాలు కురిపిస్తారు. కానీ.. బిఏ రాజు మాత్రం ఎప్పుడూ తొందరపడలేదు. స్టార్ హీరోల జోలికి వెళ్లలేదు. తన స్థాయిలో, తనకు నచ్చినట్టు సినిమాలు తీసుకున్నాడు. ఇప్పుడూ అదే పద్ధతి. పీఆర్వో అయ్యాను కదా అని పాత్రికేయాన్ని, నిర్మాత అయ్యా కదా అని పీఆర్వో గిరినీ వదల్లేదు. దేని పని దానిదే. ఇప్పుడు కూడా అంతే. తనయుడు శివని మంచి దర్శకుడిగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.
మంచి సినిమాలు తీయాలి.
ఏ సినిమాలో అయినా మంచే చూడాలి.
సినిమాలకు మంచే జరగాలి.. ఇదే ఆయన ఆలోచన. ఆచరణ.
ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని.. మరెన్నో `సూపర్ హిట్`లు అందుకోవాలని తెలుగు 360 మనసారా కోరుకుంటోంది. హ్యాపీ బర్త్ డే బీఏ రాజు.