బాహుబలి 2 సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. బాలీవుడ్‌కీ సరికొత్త టార్గెట్ సెట్ చేసింది. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడానికి బాలీవుడ్ సైతం ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. 50 రోజుల్లో బాహుబలి రికార్డులకు తిరుగులేదు. ఏకంగా 1050 సెంటర్లలో 50 రోజులు ఆడి ఈ విషయంలోనూ తనకు తిరుగులేదని నిరూపించింది. ఇప్పుడు బాహుబలి 2 సెంచరీ పూర్తి చేసింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ చిత్రబృందం కూడా ఓ పోస్టర్ విడుదల చేసింది. అయితే… వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందన్న విషయం స్పష్టం చేయలేదు. 50 రోజుల వరకూ బాహుబలి హవా కొనసాగింది. అయితే ఆ తరవాత థియేటర్ల నుంచి తీసేశారు. కొన్ని చోట్ల ఆడినా.. ఒకట్రెండు షోలకే పరిమితమైంది. బాహుబలి వంద రోజులకు దగ్గర పడుతున్న సందర్భంలో కొన్ని థియేటర్లో మళ్లీ ఈసినిమాని రీ రిలీజ్ చేశారు. ఆ మాటకొస్తే డైరెక్టర్‌గా రోజుకి నాలుగు ఆటల పాటు వంద రోజులు నిర్విగ్నంగా ప్రదర్శించిన థియేటర్లు నాలుగైదుకు మించి లేవనే చెప్పాలి. అందుకే.. చిత్రబృందం కూడా వంద ఆడిన సెంటర్లెన్నో స్పష్టం చేయలేదు. నిజానికి తన సినిమా వంద రోజులు, యాభై రోజులు ఆడించాలన్న కోరిక రాజమౌళికి ఉండదు. మగధీరని వంద రోజులు ఆడించాలి అన్నప్పుడు కూడా అల్లు అరవింద్ మాటకు అడ్డు చెప్పాడు జక్కన్న. అలాంటిది బాహుబలి వంద రోజులు పోస్టర్ విడుదల చేసి, తన ఘనత చెప్పాలనుకొన్నాడంటే రాజమౌళి మారాడని అనుకోవాలా? లేదంటే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం పోస్టర్ని విడుదల చేశాడనుకోవాలా??