యావత్ భారత చలన చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవేటెడ్ ఫిల్మ్.. బాహుబలి ది కన్‌క్లూజన్. బాహుబలి ది బిగినింగ్ సాధించిన సంచలనాలను రెండో భాగం అధిగమిస్తుందని, కచ్చితంగా కొత్త రికార్డులు నెలకొల్పుతుందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. బాహుబలి 2 షూటింగ్ దశను పూర్తి చేసుకొని ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకొంటోంది. త్వరలోనే ఆడియో విడుదల చేయడానికి చిత్రబృందం సమాయాత్తం అవుతోంది. ఇప్పుడు ఆడియో రిలీజ్ డేట్, ప్లేస్ దాదాపుగా ఫిక్స్ అయిపోయాయి.
ఉగాది రోజున బాహుబలి 2 ఆడియో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మార్చి 29న ఉగాది. ఆ రోజున గానీ, దాని ముందు రోజున గానీ పాటల్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఆడియో వేడుక ఎక్కడ జరపాలన్న విషయంలోనూ చిత్రబృందం స్పష్టమైన ప్లానింగ్‌లోనే ఉంది. విశాఖ, తిరుపతి, విజయవాడ.. ఇలా పలు పేర్లు పరిశీలనలోకి వచ్చినా… హైదరాబాద్‌లోనే ఫంక్షన్ నిర్వహించాలని రాజమౌళి అండ్ కో డిసైడ్ అయ్యారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆడియో ఫంక్షన్ దాదాపుగా ఖాయం అయిపోయినట్టే. రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి కోసం మహీష్మతీ సెట్ వేశారు. అక్కడ ఫంక్షన్ చేద్దామనుకొన్నా.. ఫిల్మ్ సిటీ ఎంట్రీ గేట్ నుంచి మాషీష్మతీ సెట్ వరకూ క్రౌడ్ వెళ్లడానికి కష్టం అవుతుందని, అందుకే ఫిల్మ్ సిటీ ఎంట్రీ గేట్‌కి అతి దగ్గరల్లోనే ఆడియో ఫంక్షన్ కోసం వేదిక సెట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఆడియో విడుదలకు ముందే ట్రైలర్‌ని విడుదల చేస్తారు. సినిమా రిలీజ్‌కీ ఆడియోకీ గ్యాప్ మరీ ఎక్కువైపోయిందని భావిస్తే గనుక… ఆడియో విడుదలకు ముందు టీజర్‌తో సరిపెడతారు. ఏప్రిల్ మొదటి, లేదా రెండో వారంలో థియేటరికల్ ట్రైలర్‌ని విడుదల చేస్తారు.