బాహుబలి 2 బెనిఫిట్ షోలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురువారం రాత్రి 9.30ల నుంచి హైదరాబాద్లోని దాదాపు అన్ని మల్టీప్లెక్స్లలోనూ, ఆర్టీసీ క్రాస్ రోడ్లలోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ బాహుబలి2 షోలు ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతి లేదు’ అని క్లారిటీగా చెబుతోంది. అంతేకాదు.. ‘శుక్రవారం నుంచే బాహుబలి షోలు ప్రదర్శించాలి. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠినమైన చర్యలు తీసుకొంటాం’ అని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓ ప్రకటన చేశారు. అయితే.. ఇప్పటికే టికెట్లన్నీ అమ్మేసిన నేపథ్యంలో షోలు రద్దు చేస్తే.. అభిమానుల నుంచి అలజడి మొదలవుతుంది. అందుకే.. చిత్రబృందం ఆలోచనల్లో పడింది.
ముందు అనుకొన్నట్టు ఏప్రిల్ 28 న విడుదల అని కాకుండా.. ఏప్రిల్ 27 రాత్రి నుంచి విడుదల అంటూ.. రిలీజ్ డేట్ తక్షణం మార్చుకొనే విషయంలో ఆలోచనల్లో ఉన్నట్టు టాక్. అలా చేస్తే… రాత్రి షోలన్నీ బెనిఫిట్ షోల లెక్కలోకి రావు. బాహుబలి బృందం ముందున్న బెస్ట్ ఆప్షన్ అదే. మరి.. రాజమౌళి అండ్ టీమ్ ఎలాంటి అడుగు వేస్తుందో చూడాలి.