బాహుబలి హంగామా మళ్లీ మొదలు కాబోతోంది. ప్రభాస్ లుక్కుల్ని ఒకొక్కటిగా విడుదల చేస్తున్న బాహుబలి టీమ్… ఇప్పుడు థియేటరికల్ ట్రైలర్ విడుదల కోసం రంగం సిద్ధం చేస్తోంది. మార్చి 15న గానీ, 16న గానీ థియేటరికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది. హైదరాబాద్ లో సింపుల్‌గా ఓ ప్రెస్ మీట్ పెట్టి, ట్రైలర్‌ని వదిలేయాలని చిత్రబృందం భావిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమా అంటే.. ముందు ఓ టీజర్ వదలడం, ఆడియో ఫంక్షన్లో ట్రైలర్‌ని చూపించడం జరుగుతుంటుంది. అయితే.. బాహుబలి విషయంలో మాత్రం టీజర్ లేకుండానే నేరుగా థియేటరికల్ ట్రైలర్‌ని లాంచ్ చేయాలని రాజమౌళి ఫిక్సయ్యారు. మార్చి 15న గానీ, 16న గానీ… ప్రసాద్ ఐమాక్స్‌లో పాత్రికేయులకు ట్రైలర్ చూపించి.. అప్పుడు యూ ట్యూబ్‌లో ఉంచాలని రాజమౌళి భావిస్తున్నార్ట. ట్రైలర్ నిడివి దాదాపుగా రెండున్నర నిమిషాలు ఉండొచ్చని తెలుగుతో పాటు మిగిలిన భాషల ట్రైలర్లనీ ఏక కాలంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. బాహుబలి 2కి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారని, చిరు గొంతుతో ఈ సినిమా ప్రారంభం అవుతుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తల్ని రాజమౌళి ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. కచ్చితంగా ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ఉండబోతోందని తెలుస్తోంది. బాహుబలి 1లో జరిగిన కథ చూచాయిగా తెర వెనుక నుంచి ఓ గొంతు వినిపిస్తుందట. ఆ గొంతు రాజమౌళిదే అయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మార్చి చివరి వారంలో పాటల్ని విడుదల చేసే ఛాన్స్ ఉంది.