కోట్లాది మంది ఆశలు మెసుకొంటూ.. బహుబలి మరోసారి బాక్సాఫీసు దండయాత్రకు సిద్ధం అవుతున్నాడు. తొలి భాగం రూ.600 కోట్లు సాధిస్తే, రెండో బాహుబలి దాదాపు 1000 కోట్లు తెచ్చుకొంటుందని ట్రేడ్ వర్గాలు అప్పుడే అంచనాలు వేసేస్తున్నాయి. వెయ్యి కోట్లు సాధించడం అంటే మాటలు కాదు. బ్రహ్మాండం బద్దలైపోయే మేటర్ ఉండాల్సిందే. మరి బాహుబలి 2లో అది ఉందా? బాహుబలి 1కి మించిన అద్భుతాలు బాహుబలి 2లో ఉన్నాయా?? కచ్చితంగా ఉన్నాయన్న రిపోర్ట్ వస్తోంది. బాహుబలి తొలి షో పడే టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ బాహుబలి 2కి సంబంధించిన కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాహుబలి 1 కంటే బాహుబలి 2 పది రెట్లు గొప్పగా ఉండబోతోందట. విజువల్ పరంగా బాహుబలి 2 ఓ స్థాయిలో కనిపించబోతోందని సమాచారం. ఇంట్రవెల్ బ్యాంగ్ ఈసినిమా మొత్తానికే హైలెట్ అని తెలుస్తోంది. ప్రభాస్ – అనుష్క, రానా – అనుష్కలతో వేర్వేరుగా కత్తి యుద్దాలు డిజైన్ చేశాడట రాజమౌళి. అవి కూడా న భూతో.. అనే స్థాయిలో ఉండబోతున్నాయని టాక్. తొలి భాగంలో రాజమౌళి సినిమాల్లో కనిపించే ఎమోషన్ మిస్ అయ్యింది. అయితే పార్ట్ 2లో మాత్రం సెంటిమెంట్ కూడా బాగా దట్టించాడని తెలుస్తోంది. సెకండాఫ్‌లో విజువల్ ఎఫెక్ట్స్ కంటే.. ఎమోషనల్ డ్రామా ఎక్కువగా పండిందని సమాచారం. బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సినిమాలోని మిగిలిన కంటెంట్‌తో పోలిస్తే.. ఆ ప్రశ్న చాలా చిన్నదిగా కనిపించబోతోందట. అసలు సినిమా మొదలైన కాసేపటికే బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న మర్చిపోయి ప్రేక్షకులంతా సినిమాలో లీనమైపోయేలా కొన్ని ఎపిసోడ్లు రాజమౌళి డిజైన్ చేశాడని సమాచారం. క్లైమాక్స్ లో ప్రభాస్ – రానాల మధ్య తెరకెక్కించిన ఫైట్ ఈ సినిమాకి మరో స్థాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు. అందరి మాటా ఒక్కటే.. ”బాహుబలి 2.. పార్ట్ 1కి మించిన అద్భుతాలు సృష్టించబోతోంది” అని. మనకూ అదే కదా కావాల్సింది.