బాహుబలి 2లో ఇంట్రవెల్ సీన్ గుర్తుంది కదా? భళ్లాలదేవకు పట్టాభిషేకం జరుగుతుంది. అదే సమయంలో బాహుబలి సైన్యాధిపతిగా ప్రమాణస్వీకారం చేస్తాడు. భళ్లాలదేవ సింహాసనం పై కూర్చున్నప్పుడు చప్పుడు చేయని మాహీష్మతీ ప్రజలు… సైన్యాధ్యక్షుడిగా బాహుబలి ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు మాత్రం ఆవేశంగా రెచ్చిపోతారు. ఆ చప్పుళ్లకు భళ్లాలదేవ సింహాసనం సైతం కదిలిపోతుంది. దాంతో… రాజునయ్యా అన్న సంతృప్తి, సంతోషకం కూడా భళ్లాలదేవ కళ్లలో మాయం అవుతుంది. ఈ సన్నివేశానికి స్ఫూర్తి.. పవన్ కల్యాణ్ అభిమానులేనట. ఈ విషయాన్ని రచయిత విజయేంద్రప్రసాదే స్వయంగా అంగీకరించారు.
విషయం ఏంటంటే… ఈమధ్య ఆడియో పంక్షన్లలో పవన్ పేరెత్తితే చాలు.. అభిమానులు రెచ్చిపోతున్నారు. ఆ సభలో పవన్ ఉన్నా, లేకున్నా.. పవర్ స్టార్ – పవర్ స్టార్ అంటూ గోల గోల చేస్తున్నారు. దాంతో ఎవ్వరికీ మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. వేదికపై ఓ హీరో ఉన్నప్పుడు, మరో హీరో గురించి అభిమానులు కేకలు వేస్తే ఎవ్వరికైనా జెలసీ వస్తుంది. భళ్లాలదేవ పాత్రలోనూ ఆ జెలసీ చూడాల్సిన సందర్భం బాహుబలి 2 కథలో వచ్చింది. ఆ సీన్ రాస్తున్నప్పుడు టీవీలో ఓ ఆడియో ఫంక్షన్ వస్తోందట. ఆ సందర్భంగా పవన్ అభిమానులు గోల గోల చేయడం, వేదిక పై ఉన్న హీరోలు చిన్నబుచ్చుకోవడం విజయేంద్ర ప్రసాద్ గమనించాడట. తన కథకి, రాయబోతున్న సన్నివేశానికీ ఆ సందర్భం నప్పడంతో… బాహుబలి ఇంట్రవెల్ సీన్ ఆ స్ఫూర్తితో డిజైన్ చేసుకొన్నార్ట. బాహుబలి 2 విజయంలో ఇంట్రవెల్ సీన్ కూడా ఓ కీలక పాత్ర పోషించింది. అంటే పార్ట్ 2లో పవన్ పాత్ర ఉన్నట్టే అనుకోవాలన్నమాట.