బాహుబలి… ఎప్పుడూ వార్తల్లో నిలిచే సినిమా. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న సంగతి బయటకు వచ్చినా.. అది సంచలనంగా మారుతోంది. ప్రభాస్ అభిమానులతో పాటు చిత్రసీమ కూడా ఆ విషయాలపై ఆసక్తిగా చర్చించుకోవడం రివాజుగా మారింది. ఇప్పుడు బాహుబలి: ది కన్క్లూజన్కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే… ఈసినిమా నిడివి చాలా తక్కువట. 1.45 నిమిషాల్లో సినిమా ముగిసిపోనున్నదట. సాధారణంగా కమర్షియల్ సినిమాలు రెండుగంటలకు పైనే ఉంటాయి. ఇది వరకు 2గంటల 30 నిమిషాలుండే సినిమా క్రమంగా 2గంటలత 15 నిమిషాలకు కుదిస్తున్నారు. అంతకంటే ఎక్కువ లాగడం కష్టమని భావించి ముందే ట్రిమ్ చేసేస్తున్నారు. బాహుబలి దాదాపు రెండున్నర గంటలుంది. కానీ పార్ట్ 2 మాత్రం 105 నిమిషాలేనట.
నిజానికి ఈ సినిమా కూడా రెండున్నర గంటలుండాల్సిందే అని ముందు అనుకొన్నార్ట.కానీ.. కావాలని పనిగట్టుకొని సినిమా లెంగ్త్ పెంచితే ఫీల్ పోయే ప్రమాదం ఉందని చిత్రబృందం భావించినట్టు తెలుస్తోంది. అందుకే కొన్ని సన్నివేశాల్ని స్ర్కిప్టు దశలోనే ట్రిమ్ చేసేశారు. దాని వల్ల బడ్జెట్ కూడా కంట్రోల్లోకి వస్తుందని చిత్రబృందం భావించిందట. సినిమా అయిపోయాక ఎండ్ కార్డ్స్‌లో దాదాపు 5 నిమిషాల పాటు మేకింగ్ వీడియో చూపించాలన్నది రాజమౌళి ఆలోచన. ఆ లెక్కన మరో అయిదు నిమిషాలు పెరుగుతుంది కదా?? అందుకే కావాలని సినిమాని పొడిగించడం కంటే.. తక్కువ టైమ్‌లోనే ఆకట్టుకొనేలా చెప్పడమే బెటర్ అన్నది ఆయన ఆలోచన కావొచ్చు.