బాహుబలి 2 తొలి షో పడే టైమ్ తెలిసిపోయింది. గురువారం రాత్రి తొమ్మిదిన్నర నుంచి ప్రీమియర్ల హడావుడి మొదలైపోనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఏసియన్ సినీ మాల్స్‌లో బాహుబలి 2 తొలి షో. ముందస్తుగానే పడిపోతోంది. ఇప్పటికిప్పుడు టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. హైదరాబాద్‌లో ఒక్కో టికెట్ రూ.1500 నుంచి 3000 ల వరకూ పలుకుతోంది. తూ.గో, ప.గో జిల్లాల్లో రేటు మరింత ఎక్కువగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అమలాపురం సర్కిల్లో గురువారం రాత్రి షోకి డిమాండ్ విపరీతంగా ఉన్నట్టు టాక్. అక్కడ ఒక్కోటికెట్కి రూ.5 వేల వరకూ డిమాండ్ చేస్తున్నార్ట.
ప్రభాస్ ప్రభావం భీమవరంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అక్కడైతే.. బాహుబలి ప్రీమియర్ షో టికెట్లు దొరకడం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేతుల్లోకి టికెట్లన్నీ వెళ్లిపోయాయి. `రాజుల`కు మాత్రమే ప్రత్యేకంగా అమ్ముతున్నట్టు వార్తలొస్తున్నాయి. అక్కడ టికెట్ రేటు రూ.3 వేల వరకూ పలుకుతోందట. తూ.గో జిల్లాలోని చిన్న చిన్న ఊర్లలో సైతం ఒక్కో టికెట్ రూ.1000కి తక్కువ అమ్మడం లేదు. మొత్తానికి బాహుబలి ప్రభంజనం ఓరేంజులో కనిపిస్తోంది. ప్రీమియర్ షోలతోనే రికార్డులన్నీ బద్దలైపోయే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో అర్థరాత్రి ఆటలకు పర్మిషన్లు లభించడం ప్రభాస్ ఫ్యాన్స్‌కి హుషారు తెప్పిస్తే… మిగిలిన ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లు అభ్యంతరం తెలుపుతున్నారు. కాటమరాయుడు ప్రీమియర్ షోల కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు చేసినా పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అలాంటిది బాహుబలికి ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి.