బాహుబలి 2కి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. బాహుబలి 2ని చూస్తూ కొంతమంది ఆ సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోలు తీయడం, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో అప్లోడ్ చేయడం తెలిసిన విషయాలే. బాహుబలి 2 ప్రీమియర్ షో ఎక్కడో పడిపోయిందని, అక్కడి నుంచే ఈ సినిమాకి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయని ప్రచారం సాగుతోంది. చిత్రబృందం ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది. ”ఇప్పటి వరకూ బాహుబలి ప్రీమియర్ షోలు ఎక్కడా ప్రదర్శించలేదు. సెన్సార్ వాళ్లకు షో వెయ్యడం తప్ప… బాహుబలి ప్రత్యేకంగా ప్రదర్శించలేదు” అని తేల్చి చెప్పింది. దాన్ని బట్టి.. ఈ క్లిప్పింగులు సెన్సార్ నుంచే లీకయ్యాయేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బాహుబలి 2కి సంబంధించిన సెన్సార్ ప్రపంచంలో చాలా చోట్ల జరిగింది. దుబాయ్, అమెరికా, కెనాడా లాంటి దేశాల్లో సెన్సార్ కోసం ప్రత్యేకంగా బాహుబలిని ప్రదర్శించారు. మరి వాటిలో ఎక్కడి నుంచి ఈ క్లిప్పింగులు బయటకు వచ్చాయో తెలియాల్సివుంది. సాహో టీజర్ లీకవ్వడం వెనుక కూడా సెన్సార్ నిర్వాకమే ఉండే అవకాశాలున్నాయి.