దశాబ్దం కిందటి వరకు..టాలీవుడ్ సినిమాలు అమెరికాలో రిలీజవ్వాలంటేనే కష్టం. బాక్సుల డబ్బులు తిరిగి వస్తే చాలనుకున్న నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అమెరికా మార్కెట్.. కోట్లకు చేరిపోయింది. సినిమా సక్సెస్ అయితే హీరో ఎవరు అనే దానితో సంబంధం లేకుండా మిలియన్ల డాలర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడా ఓవర్సీస్ మార్కెట్ అమెరికా నుంచి.. మిగతా దేశాలకు విస్తరించింది. తెలుగు వాళ్లు ఎక్కడున్నా… ప్రింట్లు వెళ్లిపోతున్నాయి. ఎంతో కొంత కలెక్షన్లను నిర్మాతలు కళ్ల జూస్తున్నారు. ఇప్పుడు నిర్మాతలను.. ఆకర్షిస్తున్న మరో ఓవర్సీస్ మార్కెట్ చైనా. బాహుబలి -2 సినిమా తొలి రోజే… అక్కడ రిలీజ్ అయిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల తొలి రోజు రికార్డును చెరిపేసింది. దాంతో..తెలుగు సినిమాలను కూడా.. ధైర్యంగా చైనీస్‌లోకి డబ్ చేస్తే.. కాసుల గలలు చూడవచ్చని టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఊహాలోకంలో తేలిపోతున్నారు.
నిజానికి చైనీస్ మార్కెట్.. ఎప్పుడూ భారత్ కు దూరమే. భారత్ కు సంబంధించి కొన్ని సినిమాల విడుదలకు మాత్రమే అవకాశం ఇస్తారు. ఆ కొన్ని సినిమాల్లో అవకాశం దక్కించుకుని బాక్సాఫీస్ లో దుమ్ము రేపాలి. కొద్ది రోజుల కిందటి వరకు.. బాలీవుడ్ సినిమాలను పాకిస్థాన్ లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపించేవారు కాన.. చైనా జోలికి వెళ్లేవారు. ఒక వేళ రిలీజ్ అయినా… పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఈ పరిస్థితి బాలీవుడ్ సినిమా అమీర్ ఖాన్ దంగల్ మార్చేసింది. దంగల్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల కంటే.. చైనాలో వచ్చిన కలెక్షన్లే ఎక్కువ. ఆ సినిమాకు అక్కడ రూ. 1200 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇక అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్ ఇండియాలో ఫ్లాప్ అయింది. కేవలం అటూ ఇటుగా ఇరవై కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా చైనాలో ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత ఇతర బాలీవుడ్ స్టార్లు కూడా.. చైనా మార్కెట్ లోకి వెళ్లేందుకు ఉత్సాహపడుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన `భజరంగి భాయిజాన్`ని కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా వచ్చిన హిందీ మీడియం కలెక్షన్లు కూడా వందల కోట్లలోనే ఉన్నాయంటే..మార్కెట్ ఎంతగా అంది వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి -2 తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకోవడంతో… చైనాలో దక్షిణాది సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉంటుందన్న భావన పెరుగుతోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైనా నరసింహారెడ్డిని చైనాలో విడుదల చేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. చైనా మార్కెట్ అంది వస్తే.. భారతీయ సినిమా ప్రమాణాలు అమాంతం పెరిగిపోతాయి. ధైర్యంగా బడ్జెట్ పెట్టే అవకాశం వస్తుంది కాబట్టి.. హాలీవుడ్ తో పోటీ పడే చాన్స్ వస్తుంది.