హైదరాబాద్: ఎప్పుడా ఎప్పుడా అని సినీ అభిమానులందరూ ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. బాహుబలి విడుదలకు రంగం అంతా సిద్ధమయింది. దర్శకుడు రాజమౌళి అత్యంత భారీవ్యయంతో రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 ధియేటర్లలో విడుదల కాబోతోంది. నిర్మాణ దశనుంచి దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తించిన బాహుబలిని చూడటానికి అభిమానులు తహతహలాడుతున్నారు. అంచనాలు పతాకస్థాయికి చేరాయి. వాటిని రాజమౌళి అందుకున్నారా, అధిగమించారా అనేది మరికొన్ని గంటలలో తేలబోతోంది.
బాహుబలి టిట్బిట్స్:
ఇది ద్విభాషా చిత్రం. తెలుగు, తమిళ భాషలలో రూపొందింది. ఇవికాక మళయాళం, హిందీ భాషలలోకి డబ్ అయింది. ఒకేసారి నాలుగు భాషలలో విడుదలవుతుంది.
రేపు విడుదలవుతున్న మొదటి భాగం, తర్వాత విడుదలయ్యే రెండవ భాగం కలిసి రు.250 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే అత్యంత భారీ చిత్రం ఇదే.
రేపు విడుదలవుతున్న మొదటి భాగం 2గం.35 నిమిషాలు ఉంటుంది.
మొత్తం 380 రోజుల షూటింగ్ జరిపితే అందులో 300 రోజులు యాక్షన్ సన్నివేశాలే చేశారు.
ప్రభాస్ రెండున్నర ఏళ్ళు ఈ చిత్రంకోసమే పనిచేశారు.
భళ్ళాలదేవ పాత్రకోసం రానా 88 కిలోలనుంచి 120 కిలోలు పెరిగాడు. అతని పాత్రకు ఆయుధం గద.
రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్కు ప్రత్యేక స్థానముంటుందని తెలిసిందే. ఈ చిత్రంలో 4,500నుంచి 5,000దాకా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉంటాయి.