హైదరాబాద్: ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న బాహుబలి చిత్రం కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఈ రికార్డుల పరంపర మొదలయింది. నైజామ్ ఏరియాలో కేవలం స్పెషల్ షోలద్వారానే కోటి రూపాయలు వసూలు చేసింది. ఇది గత చిత్రాలకంటే ఎన్నోరెట్లు ఎక్కువ. ఈ స్పెషల్ షోలు రేపు అర్ధరాత్రి 12గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. మరోవైపు ఈ చిత్రం ప్రపంచవ్యాపంగా 4,000 ధియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే అధికశాతం ధియేటర్లవద్ద హౌస్ఫుల్ బోర్డులు వేలాడుతున్నాయి. అత్యంత భారీ ఎక్స్పెక్టేషన్లతో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని చూడటానికి సినీ అభిమానులు ఉవ్విళ్ళూరుతుండటంతో బ్లాక్ టికెట్ వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో రు.2,000 నుంచి రు.4,000 వరకు టికెట్లను అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను విశ్వనాథ్ థియేటర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద 797 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.