భారతీయ సినిమామీద `బాహుబలి’ ప్రభావం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. భారీవసూళ్లు మూటగట్టుకుంటున్న ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలందుకుంటున్న బాహుబలి చిత్రంపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పందించారు. రోహిత్ షెట్టి రాబోయే చిత్రం `దిల్ వాలే’ షూటింగ్ నిమిత్తం షారుఖ్ బల్గేరియాలో ఉన్నారు. ఆయన ఈమధ్యనే బాహుబలి చిత్రం చూసి `ఓ అద్భుతమైన చిత్రం ఇది, చిత్రపరిశ్రమలోనిఅందరికీ ఇది ప్రేరణశక్తిగా నిలుస్తుంది ‘ అంటూ ప్రశంసించారు. బాహుబలి ఒక అపూర్వమైన చిత్రంగా తయారుచేసి ప్రేక్షకులకు అందించిన చిత్రబృందానికి ఆయన థాంక్స్ చెప్పారు. ఒక ప్రేరణతో అద్భుతాలు సృష్టించినప్పుడే మనం ఆకాశమంతఎత్తు ఎదగగలమని షారుఖ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
బాహుబలి చిత్రం జులై10న విడుదలై ఇప్పటికే వసూళ్లలో 300కోట్ల క్లబ్ లో చేరింది. ఇంతకుముందు మరో హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సైతం బాహుబలి చిత్రంపై ప్రశంసల జల్లుకురిపించాడు. ప్రభాస్, తమన్నా, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన బాహుబలిని దాదాపు 250కోట్ల వ్యయంతో నిర్మించారు. కాగా ఈ చిత్రం చివరి భాగం వచ్చేఏడాది విడుదలచేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.