బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా వచ్చినందుకు సంతోషించని తెలుగువారుండరు. ఉభయ శాసనసభలూ ఇందుకు అభినందనలు తెలిపాయి. దర్శకుడుగానూ రాజమౌళికి అవార్డు ఇవ్వనందుకు దర్శకరత్న దాసరి అసంతృప్తి వెలిబుచ్చితే, అవార్డుకు బాహుబలి దక్కిందని ట్విట్టర్ వీరుడు రాం గోపాల్ వర్మ చమత్కరించారు. ఇలాటి సమయంలో ఏ కాస్త వ్యాఖ్యాన్నయినా సహించడం కష్టమేగాని ఈ ప్రశ్న తప్పక వస్తుంది- ఈ విజయం విజువల్స్కా? విషయానికా? చూపించిన తీరుకా? చూపించిన కథకా? ఎందుకంటే ఈగ విజువల్స్‌కు కూడా గతంలో జక్కన్న జాతీయ అవార్డు సంపాదించారు. ఈసారి కూడా అదే అనుకుంటే అప్పుడు అభివృద్ది వున్నట్టు కాదు. ఉత్తమ చిత్రం అన్నారు గనక మొత్తానికి కలిపి ఇచ్చారని మనం అనుకోవాలి గాని – నా ఉద్దేశంలో రాజమౌళి మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే బాహుబలి చూసిన వారంతా పరిశ్రమలో వారంతా అదొక సినిమా కాదు అనుభవం అన్నారు.
ప్రధానంగా కట్టప్ప పాత్ర గురించి మాట్లాడుకున్నారు. శివగామీదేవిగా రమ్యకృష్ణ శక్తివంతంగా నటించందన్నారు. శివుడిని పెంచిన గిరిజన తల్లి పాత్రలో కాస్సేపైనా రోహిణి, అసలు తల్లిగా అనుష్క చేసింది కూడా తక్కువేమీ కాదు. మొత్తానికి ప్రధాన పాత్రల కన్నా కట్టప్ప, శివగామీ దేవి బలమైన ముద్ర వేశారంటే ఏం చెప్పాలి? రెండవ భాగంలో బహుశా అనుష్క అలాటి ముద్రే వేయొచ్చు. కట్టప్ప ఎందుకు చంపాడన్న కృత్రిమమైన ఆసక్తి రేకెత్తించి మొదటి భాగం ముగించకపోతే ఇంకా ఏమైనా ఉత్కంఠ మిగిలివుండేదా?
రాజమౌళిని మనసారా అభినందిస్తూనే వచ్చిన ఆర్థిక విజయానికి తగిన భారీ స్థాయిలోనే ముగింపు భాగంలో మానవీయ చైతన్యం అందిస్తారని ఆశిద్దాం. కేవలం రాజకుటుంబం కుట్రల కథే అయితే జనం తేలిగ్గా మర్చిపోతారు. విఠలాచార్య చిత్రాల్లో ఎన్టీఆర్ చేసిన మేరకైనా ప్రభాస్ తమన్నా అనుష్క వంటి వారు పోరాడితేనే గుర్తుంచుకుంటారు. పాటలు కూడా మరింత బాగుండాలి. మరింత అంటే బాహుబలి స్థాయిలో!