హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న బాహుబలి చిత్రం విడుదలకాకముందే పైరసీ ముప్పును ఎదుర్కొంది. ఈ చిత్రాన్ని పైరసీ చేయటానికి ప్రయత్నించిన తొమ్మిదిమందిని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారని రాజమౌళి తెలియజేశారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాజమౌళి, నిర్మాత యార్లగడ్డ శోభు, నటుడు రానా, నిర్మాత అల్లు అరవింద్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాజమౌళి రెండున్నర సంవత్సరాలు అనేక వ్యయప్రయాసలకోర్చి తెలుగు ప్రజలందరూ గర్వపడేలా బాహుబలిని తెరకెక్కించారని అరవింద్ అన్నారు. బెంగళూరు పోలీసుల చొరవ కారణంగా పైరసీ భూతంనుంచి బాహుబలి బయటపడిందని చెప్పారు. ఆన్లైన్ పైరసీ నియంత్రణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరు ఎక్కడ సినిమాను పైరసీ చేసినా క్షణాల్లో తెలిసిపోతుందని చెప్పారు. నైట్ షో అయిన తర్వాత ధియేటర్లలో సినిమాలను పైరసీ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని రాజమౌళి తెలిపారు. ధియేటర్ యజమానులు దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పైరసీ చేసిన ధియేటర్ను నిషేధిస్తామని అన్నారు.