హైదరాబాద్: బాహుబలి మొదటిభాగం నాలుగు వెర్షన్లలో కలిపి రు.500 కోట్లను వసూలుచేయడంతో రెండోభాగంగురించి దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రెండో భాగం మరో కొత్త రికార్డ్ సృష్టించబోతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది రానున్న బాహుబలి రెండో భాగానికి నిధులను స్టాక్ మార్కెట్ ద్వారా సేకరించాలని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని యోచిస్తున్నారు. ఈ చిత్రం రెండోభాగంలో పెట్టుబడి పెడతామంటూ అనేక చలనచిత్ర నిర్మాణ సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు – శోభు, ప్రసాద్‌లకు ఊపిరి సలపకుండా ఆఫర్లు ఇస్తున్నాయట. దీనితో వారిద్దరూ రెండోభాగం ప్రాజెక్ట్ నిధులకోసం పబ్లిక్ ఇష్యూకు వెళ్ళే విషయమై సమాలోచనలు జరుపుతున్నారని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. దర్శకుడు రాజమౌళిని ఈ విషయమై సంప్రదించగా, చిత్రం వ్యాపార సంబంధిత విషయాలపై తాను దృష్టి పెట్టనని చెబుతూనే, బాహుబలి-2 ప్రాజెక్టుపై అనేకసంస్థలు ఆసక్తి చూపుతున్నమాట నిజమేనని చెప్పారట. ఇదే నిజమైతే ఇలా పబ్లిక్ ఇష్యూద్వారా నిధులు సేకరించటమనేది బాహుబలి సృష్టించే మరో కొత్త రికార్డ్ అవుతుంది. ఇప్పటికే దేశంలోపల(విదేశాల కలెక్షన్లు కాకుండా) రు.500 కోట్లు(నాలుగు వెర్షన్లద్వారా) వసూలుచేసి పీకే చిత్రం రికార్డ్‌ను(రు.440 కోట్లు) అధిగమించింది. ముందుముందు మరెన్ని రికార్డులు సృష్టించనుందో చూడాలి.