బాహుబలి విజయంలో… మీడియాది కీలక పాత్ర. రాజమౌళి అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ సినిమా తీస్తున్నాడని ముందు నుంచే… డప్పుకొట్టి ఆ సినిమాకి వెన్నుదన్నుగా నిలిచాయి ప్రచార మాధ్యమాలు. వీలున్నప్పుడల్లా బాహుబలిపై భారీ కథనాలు ప్రచురించాయి. చిత్రబృందం సమాచారాన్ని ఏమాత్రం ఇవ్వడానికి ఇష్టపడకపోయినా.. ఏదోలా బాహుబలి న్యూస్ కవర్ అయ్యేలా చేశాయి. ఇంటర్వ్యూలకు ఇచ్చిన స్పేస్ అయితే లెక్కలేదు. సినిమా మొత్తానికి బాహుబలి టీమ్ ఒక్క యాడ్ కూడా ఇవ్వలేదు. అయినా సరే ఉచిత ప్రచారాన్ని భుజాలపై వేసుకొని… ఈ సినిమాకి లేనిపోని హైప్ క్రియేట్ చేసింది. ఇచ్చిన పాజిటీవ్ రివ్యూలకైతే లెక్కే లేదు. ఇంత చేసినా.. మీడియాని బాహుబలి సంస్థ గుర్తించింది లేదు.
ఇప్పుడు బాహుబలికి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా పత్రికలు, టీవీ ఛానళ్లు, వెబ్ మీడియా.. ఆ విషయాన్ని హైలెట్ చేస్తూ బాహుబలి ఘనతను మరోసారి వేనోళ్ల కొనియాడింది. ఇప్పుడు తీరిగ్గా.. బాహుబలి నిర్మాతలు మీడియాకు కృతజ్ఞతలు…అంటూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశాయి. మీడియా ఎంతో చేసిందని, చిన్న చిన్న లోటు పాట్లు ఉన్నా సర్దుకొని బాహుబలి విజయంలో కీలక పాత్ర పోషించిందని ఓ ప్రకటన పంపారు. మీడియా బాహుబలికి ఏం చేసిందో, ఎంత చేసిందో ఆ నిర్మాతలకు ఇప్పుడు గుర్తొచ్చిందా..?? జాతీయ పత్రికల్ని సెట్స్‌కి పిలిపించుకొని… అక్కడి విశేషాల్ని ముందే వాళ్లకు లీక్ చేసిన బాహుబలి టీమ్‌కి.. ఇక్కడి మీడియా గుర్తు లేనే లేదు. అసలు తెలుగు మీడియా గురించి రాజమౌళి టీమ్ లైట్ తీసుకొంది. సినిమా విడుదలై.. భారీ విజయాన్ని, రికార్డు వసూళ్లనీ అందుకొన్నప్పుడు కూడా.. మీడియాకు థ్యాంక్స్ అన్న ఒక్క మాట
చెప్పిన పాపాన పోలేదు. ఇప్పుడు… మాత్రం మీడియాకు థ్యాంక్స్ లెటర్ పంపారు! బాహుబలి 2 వస్తోంది కదా.. ఈసారీ అంతే భారీ ఎత్తున ప్రచారం చేయమని చెప్పడానికి థ్యాంక్స్ అన్న పదాన్ని వాడుకొన్నారేమో? ఏదేమైనా ప్రచారం రాబట్టుకొనే విషయంలో బాహుబలి టీమ్ ఆరితేరిపోయింది.