గత రెండేళ్లుగా దుబాయ్ లోని తెలుగువారి కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా “జబీల్ పార్క్”లో కేసరిగారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్న “గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్” ఈ ఏడాది కూడా ఆదే స్థాయిలో అవార్డ్స్ ఫంక్షన్ ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. పాపులర్ యాంకర్ సుమ మరియు సింగర్ మనో సంయుక్తంగా యాంకరింగ్ చేయనున్న ఈ వేడుకలో “బాహుబలి” చిత్ర కథానాయకుడు ప్రభాస్, ప్రతినాయకుడు రాణా, కథానాయకి తమన్నాతోపాటు నిర్మాత శోభు యార్లగడ్డ పాలుపంచుకోనున్నారు. ఫిబ్రవరి 12న అంగరంగా వైభవంగా జరగనున్న ఈ వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ను హైద్రాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో “గామా అవార్డ్స్” నిర్వహకులు కేసరి, “బాహుబలి” నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, ప్రముఖ రచయిత చంద్రబోస్, యాంకర్ సుమ, సింగర్ దీపు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గామా అవార్డ్స్ అధినేత కేసరి మాట్లాడుతూ.. “గత రెండేళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “గామా అవార్డ్స్”ను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించనున్నాం. దుబాయ్ లోని తెలుగువారందరూ అమితానందంతో ఉబ్బితబ్బిబ్బయ్యేలా ఈ వేడుకలను నిర్వహించనున్నాం. ప్రతి ఏడాది కేవలం సంగీత విభాగానికి మాత్రమే అవార్డులను అందిస్తున్న గామా.. ఈ ఏడాది “బెస్ట్ మూవీ” అనే సరికొత్త కేటగిరీని ఇంట్రడ్యూస్ చేస్తూ.. 2015 సంవత్సరం ఉత్తమ చిత్రంగా “బాహుబలి” చిత్రానికి అవార్డ్ అందించనున్నాం.
చంద్రబోస్ మాట్లాడుతూ.. “గతేడాది “మనం” చిత్రంలో నేను రచించిన “కనిపెంచిన మా అమ్మకు..” అనే పాటకు అందుకొన్న తొలి అవార్డ్ “గామా”. అటువంటి గామా అవార్డ్స్ కు ఈ ఏడాది న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ.. “గత రెండేళ్లుగా గామా అవార్డ్స్ వేడుకలకు అతిధిగా హాజరవుతున్నాను. వచ్చే ఏడాది కల్లా.. “గామా” వారి నుంచి ఓ అవార్డ్ అందుకోవాలనుకొంటున్నాను. ఈ వేడుకలను ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు” అన్నారు.
ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. “మేం “ఆర్కా మీడియా” అనే సంస్థను స్థాపించినప్పట్నుంచి “ఈటీవీ” సంస్థతో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే “గామా అవార్డ్స్” వేడుకకు మా “బాహుబలి” టీమ్ తో కలిసి హాజరవుతున్నాం” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ, సింగర్ దీపు “గామా అవార్డ్స్”లో పార్టీసిపేట్ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేయడంతోపాటు.. ఈ అవార్డ్ వేడుకలు ప్రతి ఏడాది ఇదే విధంగా జరగాలని అభిలషించారు!