రేటింగ్: 4/5
తెలుగు సినిమా లెక్కల్ని మార్చేసిన సినిమా.. బాహుబలి.
బాహుబలికి ముందు.. ఆ తరవాత.. – అని తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారంటే బాహుబలి సృష్టించిన మానియా ఏ పాటిదిదో అర్థం చేసుకోవొచ్చు. సినిమాలు చూడడం మానేసి, టీవీలకే అతుక్కుపోయిన ఓ వర్గాన్ని సైతం థియేటర్లకు రప్పించగలిగింది బాహుబలి. ఓ సినిమా స్థాయి, సాంకేతికత, బడ్జెట్, మార్కెటింగ్ ఇలా ఏ రూపంలో చూసుకొన్నా.. మిగిలిన సినిమాలకంటే అందనంత ఎత్తులో నిలబడింది బాహుబలి. అందుకే ఈ కథకు ముగింపు కోసం రెండేళ్లుగా ఎదురుచూపుల్లో పడిపోయారు సినీ అభిమానులు. రెండో భాగంలో రాజమౌళి ఇంకెన్ని అద్భుతాలు చూపిస్తాడా అంటూ గంపెడాశలతో ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెర దించుతూ.. బాహుబలి ది కన్‌క్లూజన్ విడుదలైంది. మరి… జక్కన్న చెక్కిన ఈ శిల్పం ఎలా వచ్చింది? బాహుబలి తొలి భాగంతో పోలిస్తే రెండో భాగం ఎలా ఉంది?? ఈ కథకు రాజమౌళి సరైన ముగింపే ఇచ్చాడా, లేదా?? ఈ లెక్కలన్నీ తేలాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే!
* కథ
బాహుబలి 1 ఎప్పుడైతే చూసేశారో, బాహుబలి 2 ఎలా ఉంటుంది? కథేంటి అనే విషయంలో చాలా ‘కథలు’ షికారు చేశాయి. ప్రేక్షకులు కూడా ‘బాహుబలి 2’ కథ విషయంలో దాదాపుగా ఓ అంచనాకు వచ్చేశారు. కథగా చూస్తే ఎక్కువ మంది అభిప్రాయాలు మ్యాచ్ అయ్యాయనే చెప్పాలి.
బాహుబలి 2 కథ సింపుల్‌గా చెప్పాలంటే… బాహుబలి మాహీష్మతీ రాజ్యానికి రాజు అవుతాడు. అది చూసి భళ్లాలదేవ కుళ్లిపోతుంటాడు. ఎలాగైనా తమ్ముడిని దెబ్బ కొట్టాలని, రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. బిజ్జాల దేవ కూడా తనయుడికి సింహాసనం కట్టబెట్టడానికి తన వంతు కుటిల ప్రయత్నాలు చేస్తుంటాడు. పట్టాభిషేకానికి ఇంకా సమయం ఉండడంతో దేశాటన చేయాలనుకొంటాడు బాహుబలి. నమ్మిన బంటు, మామ కట్టప్పతో కలసి కుంతల దేశానికి వెళ్తాడు. అక్కడి రాణి దేవసేనని చూసి ఇష్టపడతాడు. తానెవరో చెప్పకుండా, ఓ పిరికివాడిగా అమాయకుడిగా పరిచయం చేసుకొంటాడు. ఈలోగా తమ్ముడు దేవసేనని ఇష్టపడ్డాడన్న వార్త భళ్లాలదేవునికి తెలుస్తుంది. తమ్ముడిని దెబ్బకొట్టడానికి ఇదే మార్గం అని భావించి `దేవసేనని నేను ప్రేమిస్తున్నా.. తనని నాకు భార్యగా చేయ్` అంటూ శివగామిని ఓ కోరిక కోరతాడు. ఎలాగూ రాజ్యాధికారం దక్కలేదు.. కనీసం కోరుకొన్న అమ్మాయినైనా ఇచ్చి పెళ్లి చేద్దాం అని ఓ కన్నతల్లిగా ఆలోచిస్తుంది శివగామి. తీరా చూస్తే.. తన కొడుక్కి ఇచ్చి చేద్దామనుకొన్న శివగామిని పెళ్లి చేసుకొని తీసుకొస్తాడు బాహుబలి. దాంతో శివగామి అహం దెబ్బతింటుంది. రాజుగా సింహాసనం కావాలా? దేవసేన కావాలా? తేల్చుకోమంటే… రాజ్యం కంటే ఇచ్చిన మాటకు కట్టుబడి దేవసేననే కోరుకొంటాడు బాహుబలి. దాంతో భళ్లాలదేవ రాజు అవుతాడు. బాహుబలి సైన్యాధిపతిగా మారతాడు. అక్కడి నుంచి కథ ఏమలుపు తిరిగింది?? అసలు బాహుబలిని చంపాల్సిన అవసరం కట్టప్పకు ఎందుకొచ్చింది?? తేలాలంటే ద్వితీయార్థం చూడాలి.
* విశ్లేషణ
కథగా వింటే.. బాహుబలి 2 కొత్తగా అనిపించదు. మన అంచనాలకు భిన్నంగా ఏమీ ఉండదు. కానీ… `చూస్తే` మాత్రం ఓ అంతర్జాతీయ స్థాయిలో కనిపిస్తుంది. అదంతా రాజమౌళి మాయ. ప్రభాస్‌ని తెరపైకి పరిచయం చేసిన ఒక్క సీన్ చూస్తే చాలు. బాహుబలి 2ని రాజమౌళి ఇంకెంత కొత్తగా ఆవిష్కరించబోతున్నాడో చెప్పడానికి. విజువల్‌గా రాజమౌళి ఎక్కడా తగ్గలేదు. సీన్ సీన్‌కి డోస్ పెంచుకొంటూ పోయాడు. చాలా చిన్న సీనే అయినా.. భారీగా తన ఊహలకు అనుగుణంగా తీర్చిదిద్దాడు. రాజ దర్బార్, ఏనుగుని కట్టడి చేయడం, కుంతల దేశాన్ని కాపాడే యుద్దం, అనుష్కతో కలసి వేసిన బాణాలు.. ఇవన్నీ ఒకదాన్ని మించి మరోటి ఉండి ఔరా అనిపిస్తాయి. రాజమౌళి బలం ఎమోషనల్ సీన్స్. అవి బాహుబలి 1లో మిస్సయ్యాయి. కానీ పార్ట్ 2లో మాత్రం పుష్కలంగా కనిపించాయి. కట్టప్ప బిజ్జాల దేవ భళ్లాల దేవ మధ్య తెరకెక్కించిన ఓ సన్నివేశంలో ఈ మూడు పాత్రల్నీ ఓ స్థాయిలో తీసుకెళ్లి ఎలివేట్ చేశాడు రాజమౌళి. అక్కడే దర్శకుడిగా రాజమౌళికి పూర్తి స్థాయిలో మార్కులు పడిపోతాయి. సింహాసనం మీద కూర్చున్నానన్న ఆనందం భళ్లాలదేవుడిలో అణువంత కూడా లేకుండా ఆవిరైపోయేలా ఇంట్రవెల్ బ్యాంగ్ సీన్ డిజైన్ చేశాడు. అక్కడ భళ్లాలదేవుడి పాత్ర తాలుకూ స్వభావాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు. ఇవే కాదు. దాదాపు ప్రతీ పాత్రనీ ఎమోషన్ పరంగా పీక్స్‌కి తీసుకెళ్లాడు.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న దేశం మొత్తం అలజడి సృష్టించింది. దానికి రాజమౌళి ఎలాంటి సమాధానం చెబుతాడా? అనే ఆసక్తిని రేకెత్తించింది. రాజమౌళి కొత్తగా చూపించిందేం లేదు. జనాలు అనుకొన్నదే తెరపై కనిపించింది. కానీ అక్కడా రాజమౌళి మార్క్ తెలుస్తూనే ఉంది. కట్టప్ప చంపడానికి కారణం, చంపుతున్నప్పుడు పడుతున్న వేదన, చంపేశాక శివగామితో చెప్పే మాటలు.. ఇవన్నీ సినిమాని ఎమోషన్ పరంగా నిలబెట్టాయి. ప్రీ క్లైమాక్స్‌లో కథని లేపడం రాజమౌళికి బాగా తెలుసు. ఆ విద్య బాహుబలి 2లోనూ కనిపించింది. పతాక సన్నివేశాలన్నీ యుద్దమయం. బాహుబలి యుద్దాలు ఏ స్థాయిలో ఉంటాయో పార్ట్ 1లో చూశాం. దాంతో పోలిస్తే.. క్లైమాక్స్ తేలిపోయినట్టు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తాటి చెట్లను స్ప్రింగులుగా వాడుకొన్న విధానం లాజిక్‌కి అందలేదు. ఓ చిన్న ఊరు.. ఓ రాజ్యంపై దండెత్తి రావడం ఏమిటి? వందడుగుల విగ్రహం ఇద్దరు కొట్టుకొంటే, ఆ ధాటికి నేలమట్టం అవ్వడం ఏమిటి? రాజమౌళి కలలు ఊహకు అందనంత ఎత్తులో ఉంటాయి. మనుషుల్ని మానవాతీత శక్తుల్లా చూపించడం విడ్డూరమే. సుబ్బరాజుతో చేయించిన కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు. యుద్ద సన్నివేశాల్లో రక్తపాతం కూడా ఎక్కువగా కనిపించింది. కథలో మలుపులు లేకపోవడం, కట్టప్ప ఎపిసోడ్లో ఆసక్తిరమైన అంశం కనిపించకపోవడం బాహుబలి 2లో ప్రధానమైన లోపాలు.
* నటీనటుల ప్రతిభ
పాత్రలు గొప్పగా ఉన్నప్పుడు, పాత్రలకు సరిపడా నటీనటులు దొరికినప్పుడు ఇక చెప్పడానికి ఏముంది?? జక్కన్న చేతిలో శిల్పాల్లా మారిపోయారు నటీనటులు. ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్షత్రియ పుత్రుడు ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో ప్రభాస్ చూపించాడు. తాను పడిన కష్టం.. తెరపై కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్రతీ డైలాగ్‌నీ ఒకే బేస్‌లో చెప్పాడు ప్రభాస్. బహుశా.. ఆ లెంగ్త్‌కి బాగా ట్యూన్ అయిపోయాడనుకొంటా. తొలి భాగంలో ప్రభాస్ – రానాలకు సమాన పాత్రలు పడ్డాయి. ఓ దశలో ప్రభాస్‌ని కూడా రానా డామినేట్ చేశాడు. అయితే పార్ట్ 2లో మాత్రం ఇందుకు భిన్నంగా సాగింది. రానా పాత్ర బాగా తగ్గిపోయింది. అయితే రానా మాత్రం తన 100 % ఈ సినిమాకి ఇచ్చేశాడు. తన క్రూరత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. బిజ్జాల దేవుడిగా నాజర్ పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుంది. శివగామి మరోసారి రెచ్చిపోయింది. అనుష్క పరిధి పార్ట్ 2లో పెరిగింది. తన స్థాయిలో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చింది. కట్టప్ప.. మరోసారి తన ట్రేడ్ మార్క్ విశ్వాసాన్ని ప్రదర్శించాడు. కొత్తగా కనిపించే పాత్రల్లో సుబ్బరాజు పాత్రకే కాస్త పరిధి ఉంది. ‘నేను పార్ట్ 2లోనూ నటించా’ అని చెప్పుకొనే అవకాశం తమన్నాకు లేకుండా చేశాడు రాజమౌళి. అసలు ఆమెకు ఒక్కడైలాగ్ కూడా లేదు.
* సాంకేతిక వర్గం
కెమెరా, సంగీతం, ఆర్ట్, విజువల్ ఎఫెక్ట్స్… దేని గురించి తక్కువ చెప్పినా తప్పే. తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ప్రతీ విభాగం బలంగా పనిచేసింది.. కష్టపడింది. అందుకే ప్రతీ సీన్ విజువల్‌గా ఇంత గొప్పగా వచ్చింది. అందుకే అందరికీ జయహో అనాల్సిందే. రాజమౌళి ఊహకు సాంకేతిక నిపుణులు ప్రాణం పోశారు. రాజమౌళి ఓ అందమైన కల కన్నాడు. ఆ కలని సాకారం చేసుకోవడానికి ఐదేళ్లు శ్రమించాడు. కానీ మరో పాతికేళ్లు చెప్పుకొనే సినిమాని అందించాడు. రాజమౌళి కష్టం అలా ఫలించినట్టే. రాజమౌళికి ఏయే రంగాల్లో పట్టుందో.. అదంతా తెరపై కనిపిస్తూనే ఉంది. ఓ జానపద కథని, చందమామ పుస్తకంలో చదువుకొన్న కథని, ఓ కలలాంటి కథని అందంగా, అద్భుతంగా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా తెరకెక్కించాడు. అందుకే ఆ క్రెడిట్ అంతా ఆయనకే చెందాలి.
* ఫైనల్ టచ్: బాక్సాఫీస్… ఊపిరి పీల్చుకోకు.. బాహుబలి మళ్లీ వచ్చేశాడు!!
రేటింగ్: 4/5